మేటిచందాపూర్‌లో ఇద్దరు నేతల సస్పెన్షన్‌తో, క్రమశిక్షణ రాజకీయాలకు తెరలేపిన పార్టీ
చెరుకు లింగం గౌడ్, అశోక్ గౌడ్ లను పార్టీ నుండి సస్పెండ్.
మర్రిగూడ(క్రైమ్ మిర్రర్):- గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం, భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్)పార్టీ తన క్రమశిక్షణ వైఖరిని, కఠినంగా అమలు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మేటిచందాపూర్ గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో, పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించిన చెరుకు లింగం గౌడ్, గ్రామశాఖ అధ్యక్షుడు ఐతగోని అశోక్ గౌడ్‌లను, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బిఆర్ఎస్ స్పష్టమైన సంకేతాన్ని పంపింది.
ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో, బిఆర్ఎస్ పార్టీ తరఫున ఏరుకొండ అబ్బయ్యను, మునుగోడు నియోజకవర్గ పార్టీ ఇంచార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. అయితే పార్టీ అభ్యర్థిని కాదని, ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా వ్యవహరించడం ద్వారా, అంతర్గతంగా పార్టీ బలహీనపడిందన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ చర్యలే చివరకు అభ్యర్థి ఓటమికి దారితీశాయన్న భావన, పార్టీ శ్రేణుల్లో బలంగా వ్యక్తమైంది. ఈ పరిణామాలు గ్రామస్థాయిలో తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయి. పార్టీపరువు, క్రమశిక్షణ దెబ్బతిన్నాయని భావించిన బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఈ నెల 16న జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
సమావేశంలో పార్టీ నిర్ణయాలను బేఖాతరు చేసిన వారిపై, కఠిన చర్యలు తీసుకోవాలంటూ విస్తృత చర్చ జరిగింది. పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా వ్యవహరించడం, కేవలం వ్యక్తిగత తప్పిదంకాదని, పార్టీ ఉనికికే ముప్పుగా మారుతుందన్న అభిప్రాయానికి సమావేశం చేరుకుంది. దీనితో ఇరువురిని పార్టీ నుంచి బహిష్కరించాలంటూ, ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామస్థాయి తీర్మానాన్ని మునుగోడు నియోజకవర్గ ఇంచార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన అనంతరం, ఆయన ఈ వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణ కోణంలో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన పార్టీ నియమాలు అందరికీ సమానమేనని, పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా వ్యవహరించడం అత్యంత తీవ్రమైన పార్టీ వ్యతిరేక చర్యగా భావిస్తామని స్పష్టం చేశారు. ఎంతటి పదవులు, హోదాలు ఉన్నా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే, చర్యలు తప్పవని ఆయన తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంతో చెరుకు లింగం గౌడ్, గ్రామశాఖ అధ్యక్షుడు ఐతగోని అశోక్ గౌడ్‌లను, బిఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ నిర్ణయం గ్రామ రాజకీయాల్లో మాత్రమే కాకుండా, మర్రిగూడ మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పార్టీ అంతర్గత విభేదాలకు తావులేకుండా, భవిష్యత్తు ఎన్నికలలో క్రమశిక్షణే, కీలక ఆయుధమన్న సంకేతాన్ని బిఆర్ఎస్ ఈ చర్య ద్వారా స్పష్టంగా పంపిందన్న విశ్లేషణ వినిపిస్తోంది. మొత్తంగా మేటిచందాపూర్ ఘటన, గ్రామస్థాయి ఎన్నికలైనా పార్టీ క్రమశిక్షణ విషయంలో, రాజీలేదన్న బిఆర్ఎస్ వైఖరికి ప్రతీకగా మారింది. ఇది రానున్న రోజుల్లో పార్టీ శ్రేణులకు హెచ్చరికగా, ప్రత్యర్థులకు రాజకీయ సందేశంగా నిలవనుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.





