
ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు తెలపడంపై నిషేధం విధించడంపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. ధర్నాలు చేయవద్దని స్తూ ఆదేశాలు జారీచేయడం అప్రజాస్వామికం అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, విద్యార్థుల హక్కులకు సంబంధించిన ఎన్నో పోరాటాల్లో కీలకపాత్ర పోషించింది ఓయూ విద్యార్థులేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.ప్రజాస్వామ్య భారతదేశంలో నిరసన తెలపడం పౌరుల ప్రాథమిక హక్కు అన్నారు.
కనీస విద్య, నివాస వసతులు కూడా కల్పించలేని ఉస్మానియా వర్సిటీ యాజమాన్యానికి తమ ఆందోళన తెలియజేయడం విద్యార్థుల హక్కుగా ఉందన్నారు కిషన్ రెడ్డి. కానీ, విద్యార్థులు కనీసం నిరసన తెలపకుండా పోలీసుల పహారాలో అణచివేయాలని చూస్తే.. తెలంగాణ సమాజం చేతులు ముడుచుకొని అంగీకరించదని తేల్చి చెప్పారు. ఇలాగే విద్యార్థుల హక్కులను అణిచివేయడానికి ప్రయత్నించిన కేసీఆర్‌ను ఫాంహౌజ్ కే పరిమితం చేసిన తెలంగాణ ప్రజలు… ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే గద్దెదించడం తెలంగాణ విద్యార్థి, యువతకు పెద్ద విషయం కాదని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశత్వ పోకడలు పక్కన పెట్టి విద్యార్థుల హక్కులను హరించేలా విడుదల చేసిన సర్క్యులర్ వెంటనే వెనక్కు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులపై అక్రమ వేధింపులను ఆపడంతోపాటు వారిపై పోలీసు నిర్బంధాన్ని ఉపసంహరించుకోవాలని.. ఈ విషయంలో ఓయూ విద్యార్థులకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు తెలియచేస్తోందని కిషన్ రెడ్డి చెప్పారు.