హెచ్-1బీ వీసాదారులకు భారీ షాక్

అమెరికాలో హెచ్-1బీ వీసాలపై ఆధారపడి ఉన్న విదేశీ వృత్తి నిపుణులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.

అమెరికాలో హెచ్-1బీ వీసాలపై ఆధారపడి ఉన్న విదేశీ వృత్తి నిపుణులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులను ఉద్దేశించి టెక్సాస్ రాష్ట్రంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. టెక్సాస్ స్టేట్ కాలేజీలు, ప్రభుత్వ సంస్థల్లో హెచ్-1బీ వీసా ఉద్యోగుల నియామకాలను నిలిపివేస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ హయాంలో కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో అమెరికాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది ఆశలు ఒక్కసారిగా ఆవిరయ్యాయి.

ఈ నిర్ణయంపై టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అమెరికన్ ఉద్యోగాలు అమెరికన్లకే చెందాలన్న నినాదాన్ని మరోసారి బలంగా వినిపించారు. టెక్సాస్ రాష్ట్రానికి చెందిన అన్ని ప్రభుత్వ ఏజెన్సీలు, విశ్వవిద్యాలయాల్లో కొత్త హెచ్-1బీ వీసా పిటిషన్లను తక్షణమే నిలిపివేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

అమెరికా సంస్థలు విదేశీ కార్మికులను నియమించుకునే ముందు అర్హత కలిగిన అమెరికన్ కార్మికులను ప్రాధాన్యంగా తీసుకోవాలని గవర్నర్ అబాట్ సూచించారు. టెక్సాస్ రాష్ట్ర సంస్థల్లో హెచ్-1బీ నియామకాలపై విధించిన ఈ నిషేధం మే 31, 2027 వరకు కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా ఐటీ, ఇంజినీరింగ్ రంగాల్లో పనిచేస్తున్న విదేశీ వృత్తి నిపుణులపై తీవ్ర ప్రభావం పడనుంది.

ఇదిలా ఉండగా భారతీయ వృత్తి నిపుణులకు మరో సమస్య ఎదురవుతోంది. హెచ్-1బీ వీసా స్టాంపింగ్‌కు సంబంధించిన ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లు భారీగా ఆలస్యం అవుతున్నాయి. ప్రస్తుతం కొత్త అపాయింట్‌మెంట్లు నేరుగా 2027 సంవత్సరానికి మారిపోయాయి. ఇంటర్వ్యూ స్లాట్ల కొరత కారణంగా వేలాది మంది భారతీయులు అమెరికా వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

భారత్‌లోని అమెరికా కాన్సులేట్లలో బ్యాక్‌లాగ్ తీవ్రంగా పెరిగిపోయింది. వాస్తవానికి 2025 చివర్లో తొలిసారి ఈ జాప్యం ప్రారంభమైంది. అప్పట్లో ఇంటర్వ్యూలను 2026కి మార్చగా, ఆ తర్వాత అక్టోబర్ 2026కు, ఇప్పుడు నేరుగా 2027కి మారినట్లు సమాచారం. దీంతో ఇప్పటికే ఉద్యోగాలు దక్కించుకున్న కొందరి భవిష్యత్ కూడా ప్రశ్నార్థకంగా మారింది.

ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా వంటి ప్రధాన కేంద్రాల్లో ప్రస్తుతం కొత్త హెచ్-1బీ ఇంటర్వ్యూ స్లాట్లు అందుబాటులో లేవు. దీంతో ఉన్న అపాయింట్‌మెంట్లను అధికారులు సుమారు 18 నెలలు ముందుకు వాయిదా వేశారు. ఫలితంగా ఎక్కువ మంది వృత్తి నిపుణులు భారత్‌లోనే చిక్కుకుపోయే పరిస్థితి ఏర్పడింది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇమిగ్రేషన్ నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న హెచ్-1బీ ఉద్యోగులు వీసా స్టాంపింగ్ కోసం భారత్‌కు రావద్దని హెచ్చరిస్తున్నారు. మరోవైపు అమెరికా విదేశాంగ శాఖ ఇటీవల తీసుకున్న నిర్ణయం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. భారతీయులు ఇతర దేశాల్లోని అమెరికా కాన్సులేట్లలో వీసా స్టాంపింగ్ చేయించుకునే అవకాశాన్ని నిలిపివేయడంతో, భారత్‌లోని కేంద్రాలపై ఒత్తిడి మరింత పెరిగింది. మొత్తం మీద హెచ్-1బీ వీసాల వ్యవహారం భారతీయులకు పెద్ద సవాలుగా మారుతోంది.

ALSO READ: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button