
బెట్టింగ్ భూతం భయపెడుతోంది. ఇప్పటికే ఎంతో మంది ఈ భూతానికి బలయ్యారు. అయినా.. యువత తీరులో మార్పురావడం లేదు. రాత్రికి రాత్రి కోట్లు సంపాదించాలన్న దురాశ వారిని.. బెట్టింగ్స్ వైపు నెడుతోంది. ఫలితంగా ప్రాణాలను ఫణ్ణంగా పెట్టాల్సి వస్తోంది. కరీంనగర్ జిల్లాలోనూ ఇలాంటి సంఘటనే జరిగింది.
ఆన్‌లైన్ గేమ్స్, IPL క్రికెట్ బెట్టింగ్.. ఇలాంటివన్నీ యువతను తప్పుదారి పట్టిస్తున్నాయి. క్షణాల్లో లక్షలు సంపాదించాలనే అత్యాశ ఈ వ్యసనంలోకి లాగుతోంది. ఒకసారి ఇందులో దిగితే… నిండా ముంచేస్తుంది. మొదట్లో చిన్న మొత్తంతో మొదలైన బెట్టింగ్.. ఆ తర్వాత పెద్ద మొత్తాల వరకు వెళ్తుంది. అప్పుల్లో కూరుకుపోయాక.. తేరుకునే మార్గం కూడా కనిపించదు. దీని పర్యవసానం… అత్యంత విషాదంగా మారుతోంది. లక్షల రూపాయాలు పోగొట్టుకున్న యువత నిరాశలో కూరుకుపోయి…. ప్రాణాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
స్నేహితుల ఒత్తిడితోనో… త్వరగా డబ్బు సంపాదించాలనే దురాశతోనో ఆన్‌లైన్ గేమ్స్, ఐపీఎల్ బెట్టింగ్‌లో చిక్కుకుంటున్నారు యువకులు. అప్పుల ఊబిలో కూరుకుపోయి బయటపడలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా.. బెట్టింగ్ భూతం దెబ్బకు బిడ్డను పోగొట్టుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. అయితే.. ఇక్కడ బెట్టింగ్ భూతం.. ఆ ఇంటి బిడ్డనే కాదు… తండ్రిని కూడా మింగేసింది.
కరీంనగర్ జిల్లా మన్నెంపల్లి గ్రామానికి చెందిన నిఖిల్… ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. లక్షల్లో అప్పు చేసి… పెట్టుబడి పెట్టాడు. మొత్తం పోగొట్టుకుని.. అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. బయటపడే దారి తెలియక… మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఏం చేయాలో పాలుపోక… ఆత్మహత్యే శరణ్యమనుకున్నాడు. ప్రాణాలు తీసుకున్నాడు. నిఖిల్ చావును తట్టుకోలేకపోయిన తండ్రి తిరుమలరావు… మనోవేదనకు గురయ్యాడు. కొడుకు లేని లోకంలో ఉండలేకపోయాడు. వ్యవసాయ బావి దగ్గరకు వెళ్లి.. పరుగుల మందు తాగేశాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా.. ఆయన ప్రాణం నిలవలేదు. నిఖిల్ అత్యాశ… ఆన్‌లైన్ బెట్టింగ్ అలవాటు… అతనితో పాటు తండ్రి మరణానికి కూడా కారణమైంది. కుటుంబాన్నే నాశనం చేసేసింది. బెట్టింగ్ జోలికి వెళ్లొద్దని పదే పదే హెచ్చరించినా… యువత ఇంకా ఆ వలలో పడుతూనే ఉంది. సర్వం పోగొట్టుకుని… చావును కొని తెచ్చుకుంటోంది. ఇకనైనా… ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్స్ జోలికి వెళ్లొద్దు.. ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు.