క్రైమ్

Matrimonial Scam: మ్యాట్రిమోనియల్ స్కామ్.. యువతి నుంచి ఏకంగా రూ. 1.75 కోట్లు కొట్టేశాడు!

మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయమైన మహిళా సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ను.. పెళ్లి కాలేదని నమ్మించేందుకు భార్యనే అక్క గా పరిచయం చేసి రూ.1.75 కోట్లు దోచుకున్నాడు ఓ కేటుగాడు.

Bengaluru Matrimonial Scam: ఆన్‌లైన్‌ మ్యాట్రిమోనియల్ పేరుతో మరో బడా స్కామ్ బయటపడింది. ఆన్ లైన్ ద్వారా పరిచయమైన మహిళా సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ను పెళ్లి కాలేదని నమ్మించేందుకు భార్యనే అక్క గా పరిచయం చేసి రూ.1.75 కోట్లు దోచుకున్నాడు ఓ మోసగాడు. ఈ మోసంలో కుటుంబ సభ్యులందరినీ భాగస్వాములను చేశాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇంతకీ అసలు ఏం జరిగిందటే?

వైట్‌ ఫీల్డ్‌ కు చెందిన సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ యువతికి గతేడాది మార్చిలో మ్యాట్రిమోని వెబ్‌సైట్‌ ద్వారా విజయ్‌ రాజ్‌ గౌడ పరిచయమయ్యాడు. తాను పారిశ్రామికవేత్తనని, రూ.715 కోట్ల ఆస్తులున్నాయని నమ్మించాడు. విజయ రాజ్‌ గౌడకు అప్పటికే సౌమ్యతో పెళ్లి కాగా.. వీరికి ఓ బిడ్డ ఉంది. అయితే, సౌమ్యను తన అక్కగా యువతికి పరిచయం చేశాడు. యువతిని కెంగేరికి పిలిపించుకుని కుటుంబసభ్యులను పరిచయం చేశాడు. వారంతా కలిసి పెళ్లికి సంబంధించిన అంశాలు చర్చించారు. తన తండ్రి రిటైర్డ్‌ తహసీల్దార్‌ అని నమ్మించాడు. కోడలిని బాగా చూసుకుంటామని, కట్నంగా ఇచ్చే సొమ్ముకు తాను గ్యారెంటీ అంటూ విజయ్‌ తండ్రి బోరేగౌడ భరోసా ఇచ్చాడు. ఆ తర్వాత కొన్నిరోజులకు విజయ్‌ తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. తన ఆస్తులపై ఈడీ కేసు నమోదు చేసిందని, బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్‌ చేశారంటూ నకిలీ కోర్టు కాపీలు చూపించాడు.

విడుతల వారీగా రూ. 1.75 కోట్లు స్వాహా

తొలుత అవసరమని యువతి నుంచి రూ.15వేలు తీసుకున్నాడు. తర్వాత కలిసి వ్యాపారం చేద్దామని నమ్మించి యువతి పేరిట పలు బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నాడు. బిజినెస్ లో లాభం వస్తుందంటూ యువతి స్నేహితుల నుంచీ లక్షలాది రూపాయలు తీసుకున్నాడు. ఇలా విడతలవారీగా రూ.1.75 కోట్లు స్వాహా చేశాడు. డబ్బు తిరిగివ్వాలని అడిగితే ఓసారి హైకోర్టులో, మరోసారి సుప్రీంకోర్టులో కేసులున్నాయంటూ వాయిదాలు వేస్తూ వచ్చాడు. తీవ్రంగా ఒత్తిడి చేయడంతో మళ్లీ డబ్బు అడిగితే హతమారుస్తానని యువతిని బెదిరించాడు. అతడి సోషల్‌ మీడియా ఖాతాలను యువతి పరిశీలించగా.. అతడికి అప్పటికే పెళ్లి అయిన విషయం వెలుగులోకి వచ్చింది. అక్కగా పరిచయం చేసిన సౌమ్యనే అతని భార్య అని తెలిసింది. దీంతో మోసపోయానంటూ యువతి ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button