
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ఈనెల 18వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కావాలని బంద్ నిర్వహించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ బందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని పార్టీలు కూడా మద్దతు ప్రకటిస్తూ నిరసనలలో పాల్గొన్నాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా జరిగినటువంటి ఈ బంద్ లో అక్కడక్కడ కొద్దిపాటి హింసాత్మకమైనటువంటి ఘటనలు చోటు చేసుకున్న వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. కొంతమంది వ్యాపారులు అక్కడక్కడ షాపులు మూసి వేయలేదని ఆగ్రహంతో రెచ్చిపోయి కొందరు వాహనాలపై, పెట్రోల్ బంకులపై, చిన్నచిన్న దుకాణాలపై దాడులకు పాల్పడడంతో దాదాపు 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాదులోని నల్లకుంట, కాచిగూడ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద 8 మందిపై కేసులను నమోదు చేసామని పోలీస్ అధికారులు తెలిపారు. ఈ ఎనిమిది మందిని అరెస్టు చేసి వెంటనే రిమాండ్ కూడా తరలించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎటువంటి కార్యక్రమంలోనైనా సరే అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే మాత్రం కచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా నిన్న జరిగినటువంటి ఈ బందులో బీసీ నేతలు అలాగే బీసీ సంఘాలతో పాటుగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు. విచిత్రంగా జాగృతి పార్టీ చీఫ్ కవిత తనయుడు కూడా బీసీ బందులో పాల్గొనడంతో రాష్ట్రంలో ఈ విషయం వైరల్ గా మారిపోయింది. మరోవైపు కాంగ్రెస్ మరియు బీజేపీ నాయకులు కూడా ఎవరికి వారే అన్నట్లుగా నినాదాలు చేసుకున్న ఘటనలు కూడా హైలైట్ అయ్యాయి. ఏది ఏమైనా కూడా సాయంత్రానికి ప్రశాంతంగా బీసీ బంద్ ముగిసింది.
Read also : జోగిపేటలో హృదయ విదారక దృశ్యం… కొడుకు మృతదేహంతో తల్లి ఆందోళన
Read also : కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ అరెస్ట్