తెలంగాణ

భాగ్యనగరంలో బోనాల సందడి.. భక్తులతో గోల్కొండ కోట కిటకిట!

Golconda Bonalu 2025: భాగ్యనగరంలో బోనాల సంబురాలు మొదలయ్యాయి. గోల్కొండ బోనాలతో ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. వేద మంత్రాలు, శివసత్తులు, పోతురాజుల విన్యాసాలతో గోల్కొండ కోటల భక్తులతో కిక్కిరిసింది. మైదరాబాద్ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆషాఢం బోనాలు గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించడంతో మొదలయ్యాయి. నగరం నలుమూలల నుంచి తరలి వచ్చిన భక్తులతో కోట కిటకిటలాడింది. తొలిరోజు అమ్మవారిని ఏకంగా 2 లక్షల మంది దర్శించకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ అమ్మవారికి పట్టువస్త్రాలు అందజేశారు. బోనాల నిర్వహణకుగాను జగదాంబిక ట్రస్టు సభ్యులకు రూ. 11.50 లక్షల చెక్కును  అందజేశారు.

బోనం సమర్పించిన పలువురు ప్రముఖులు

గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి ఎమ్మెల్సీ విజయశాంతి ప్రత్యేక బోనం సమర్పించారు. తాను ఎమ్మెల్సీ అయిన తర్వాత తొలి బోనం ఎత్తుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా బోనం సమర్పించారు. అమ్మవారు తెలంగాణ ప్రజలందరినీ చల్లగా చూడాలని కోరుకున్నట్లు తెలిపారు. మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి శైలజా రామయ్యర్‌, కలెక్టర్‌ హరిచందన, పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌, మేయర్‌ విజయలక్ష్మి, వీహెచ్‌, బీజేపీ నాయకురాలు మాధవీలత అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు.

కనకాల కట్టమైసమ్మకు కుమ్మర్ల బోనాలు

అటు తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ లోని కనకాల కట్టమైసమ్మకు ఘనంగా బోనాలు సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుమ్మర మహిళలు బోనాలతో తరలివచ్చారు. ఫలహారబండికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ లోని జగదీష్‌ మందిర్‌ నుంచి ట్యాంక్‌ మీదుగా వందలాది మంది మహిళలు బోనాలతో వెళ్లి కట్టమైసమ్మ దేవాలయంలో బోనం సమర్పించారు.

Read Also: ఐఎస్ఎస్ లోకి శుభాన్షు, తొలి భారతీయుడిగా రికార్డు!

Back to top button