
Atrocious: అత్తింటి వేధింపులు ఓ తల్లి మనసును ఎంతగా కలిచివేస్తాయో చాటిచెప్పే హృదయవిదారక ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. భర్త, అత్త వేధింపులు భరించలేక క్షణికావేశంలో తల్లి కన్నబిడ్డలనే చంపి, అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించిన విషాద ఘటన బాగల్‌కోట్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ సంఘటన సమాజాన్ని షాక్‌కు గురిచేసింది. మాతృత్వమే దేవత్వంగా భావించే సమాజంలో, పరిస్థితులు ఎంత దారుణంగా మారితే తప్ప ఇలాంటి నిర్ణయానికి దారి తీస్తాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పోలీసుల కథనం ప్రకారం.. బాగల్‌కోట్ జిల్లాకు చెందిన రూపా హనుమంత్ గౌడర్ (27), హనుమంత్ దంపతులకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు సమృద్ధి (5), ప్రీతమ్ (4), సుక్షిత్ (2) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే కొంతకాలంగా భర్త, అత్త నుంచి వేధింపులు ఎదురవుతున్నాయని రూప తన ఆవేదనను సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇంట్లో చిన్నచిన్న విషయాలకే గొడవలు జరుగుతుండేవని, ఈ క్రమంలో శనివారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం.
ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని పరిస్థితులు రూపను ఈ ఘోర నిర్ణయానికి నెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఉదయం సుమారు 10 గంటల సమయంలో హనుమంత్ తన తల్లిని గుడిలో దింపి, అనంతరం పొలం పనులకు వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో రూప మాత్రమే ఉండటంతో, మానసిక ఒత్తిడికి లోనైన ఆమె అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ముందుగా తన ముగ్గురు చిన్నారులను ఉరేసి చంపిన రూప.. అనంతరం డీజిల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.
మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఇంటికి తిరిగివచ్చిన హనుమంత్, తలుపులు లోపల నుంచి గడియ వేసి ఉండటాన్ని గమనించాడు. ఎంత పిలిచినా స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి స్థానికుల సహాయంతో తలుపులు బద్దలు కొట్టారు. ఇంట్లోకి వెళ్లగానే అక్కడి దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి. ముగ్గురు చిన్నారులు విగతజీవులుగా వేలాడుతూ కనిపించగా, రూప అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. అనంతరం స్థానికుల సహాయంతో రూపను బాగల్‌కోట్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆమె ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుంది. వైద్యులు ఆమె పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ ఘటనపై బాగల్‌కోట్ జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ గోయల్ స్పందిస్తూ.. ప్రాథమిక విచారణలో భర్త, అత్త వేధింపుల కారణంగానే రూప ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందని తెలిపారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడ్డ తర్వాత పూర్తి స్థాయిలో వాంగ్మూలం నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని, ఎవరి తప్పు ఉన్నా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
ALSO READ: Kavita comments: ‘కేటీఆర్‌ది నియంత్రృత్వ, రాచరికపు పోకడ’.. కవిత సంచలన వ్యాఖ్యలు





