- నల్లకుంటలో దారుణ ఘటన… కామినేని ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: నగరంలో చైనా మాంజా మరోసారి ప్రమాదానికి కారణమైంది. హైదరాబాద్లోని నల్లకుంట ప్రాంతంలో చైనా మాంజా తగిలి ఓ ఏఎస్ఐకి గొంతు వద్ద తీవ్ర గాయాలు అయిన ఘటన కలకలం రేపింది.
నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న నాగరాజు, ఎగ్జిబిషన్ డ్యూటీకి వెళ్లుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. రోడ్డుపై ప్రయాణిస్తున్న క్రమంలో అకస్మాత్తుగా చైనా మాంజా గొంతుకు తగలడంతో తీవ్రంగా గాయపడిన ఆయన రక్తస్రావంతో కుప్పకూలినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
తక్షణమే సహచరులు స్పందించి నాగరాజును నగరంలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో చైనా మాంజా వల్ల జరుగుతున్న ప్రమాదాలపై మరోసారి చర్చ మొదలైంది.
నిషేధం ఉన్నప్పటికీ నగరంలో అక్రమంగా చైనా మాంజా వినియోగం కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు ఈ ఘటనపై వివరాలు సేకరిస్తూ, చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై కఠిన చర్యలు తీసుకునే దిశగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
చైనా మాంజా కారణంగా ప్రాణాపాయ ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిషేధిత మాంజాను ఉపయోగించకుండా సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.





