Aravalli Hills Mining Case: ఆరావళి పర్వత శ్రేణుల్లో మైనింగ్ వివాదంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత నేతృత్వంలో విచారణ జరిగింది. ఇటీవల ఆరావళి పర్వతాలకు సంబంధించి ఆమోదించిన నిర్వచనాలపై కొన్ని వివరణలు అవసరమని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. అదే సమయంలో ఈ అంశంపై గత నెలలో జారీ చేసిన తీర్పుపై స్టే విధించింది. గతంలో అధికారులతో కూడిన కమిటీ చేసిన సిఫార్సుల పర్యావరణ ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని కోర్టు పేర్కొంది. ఆరావళి కొండల నిర్వచనంపై దాఖలైన సమస్యపై సుమోటో కేసులో కోర్టు సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
కీలక ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే
100 మీటర్లలోపు ఎత్తు ఉన్న ఆరావళి పర్వతాల వద్ద మైనింగ్‌కు గతంలో అనుమతులు ఇచ్చింది సుప్రీంకోర్టు. తాజాగా గతంలో ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తూ నేడు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సందర్భంగా తాత్కాలిక దరఖాస్తుదారుల ప్రవర్తనపై సీజేఐ తీవ్ర అసంతృప్తి చెందారు. ఆరావళి పర్యతాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని, పర్యావరణ ముప్పునకు పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని కమిటీకి సూచించింది. ఈ కేసును జనవరి 21,2026 న వివరణాత్మకంగా విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.





