
క్రైమ్ మిర్రర్, అమరావతి:- ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోడి పందాలు జూదానికి మాత్రమే కాకుండా జంతు హింసకు కూడా దారితీసే అక్రమ చర్యలని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జూద నిరోధక చట్టంతో పాటు జంతు హింస నిరోధక చట్టంను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. బరులు నిర్వహిస్తున్నట్టు సమాచారం అందిన వెంటనే పోలీసులు ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలని హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. అవసరమైతే సెక్షన్ 144ను విధించి ప్రజా శాంతి భద్రతలను కాపాడాలని సూచించింది.
Read also : విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ
ఈ ఆదేశాల అమలులో భాగంగా జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు స్పష్టమైన దిశానిర్దేశాలు జారీ చేసింది. కోడి పందాలు లేదా జూదంలో పాల్గొన్న వారి వద్ద ఉన్న నగదు, సామగ్రిని సీజ్ చేయాలని, అక్రమ కార్యకలాపాలను పూర్తిగా నియంత్రించాలని కోర్టు ఆదేశాల్లో పేర్కొంది. ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించే ఇలాంటి అక్రమ చర్యలపై ఏమాత్రం సడలింపు ఉండకూడదని హైకోర్టు స్పష్టం చేయడంతో, రాష్ట్రవ్యాప్తంగా కఠిన చర్యలు చేపట్టే అవకాశాలు పెరిగాయి.





