తిరుపతికి వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఆరుగురు భక్తులు చనిపోయిన తొక్కిసలాట జరిగిన ప్రమాద స్థలిని పరిశీలించారు. ఘటన పూర్వాపరాలు టీటీడీ ఈవో నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సంద్రభంగా అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. కలెక్టర్, టీటీడీ అధికారులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు చంద్రబాబు. సరిగ్గా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్దతి ప్రకారం పని చేయడం నేర్చకోవాలని వార్నింగ్ ఇచ్చారు.
తిరుమల పవిత్రను కాపాడుతామని, భక్తులకు ఇబ్బంది లేకుండా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. రాజకీయాలు చేస్తే సహించబోనని..భక్తితో సేవాభావంతో పనిచేయాలని సూచించారు.
మృతి చెందిన 6 మందిలో ఒక్కోక్కరికి రూ.25 లక్షల పరిహారం, వారి కుటుంబ సభ్యులలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆరోగ్యం సీరియస్ ఉన్న మరో ఇద్దరిలో ఒక్కొక్కరికి రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. గాయపడ్డ 33 మందిలో ఒక్కొక్కరికి రూ.2 లక్షల పరిహారం, వారందరికి శుక్రవారం శ్రీవారి దర్శనం, వారందరిని వారివారి ఇంటికి చేర్చే బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు చంద్రాబబు.
నిర్లక్ష్యం వహించిన డిఎస్పీ రమణ కుమార్, టిటిడి గోశాల డైరెక్టర్ హరినాథ రెడ్డిలను విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.టిటిడి జేఈవో ఎం.గౌతమి, టిటిడి సివిఎస్వో శ్రీధర్ , తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడులను బదిలీ చేశారు. తొక్కిసలాట సంఘటనపై న్యాయ విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎంతటి వారైనా వడ్డీకాసుల వాడీ లెక్కల నుండి తప్పించుకోలేరని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
క్రైస్తవులకు జెరూసలేం, ముస్లింలకు మక్కా లాగా, తిరుమల హిందువులకు పవిత్ర పుణ్యక్షేత్రమని, జీవితకాలంలో ఒకసారైనా శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. భక్తుల ఆశయాలకు తగ్గట్లు టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు, టిటిడీ ఈవో జె. శ్యామల రావు, టిటిడి పాలక మండలి సభ్యులు సమిష్టిగా సమన్వయంతో భక్తితో సేవలు అందించాలని సూచించారు. గత ఐదేళ్లలో తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరిచి తిరుపతిలో టోకెన్లు ఇచ్చే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ కొత్త సంస్కృతి ఆగమ శాస్త్రం ప్రకారం చేశారా అనేది తమకు తెలియదన్నారు. ఆగమ నిపుణలను సంప్రదించి టిటిడి బోర్డు ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటుందన్నారు.
ఆసుపత్రిలో వైద్య సేవలు అందుకుంటున్న క్షత్రగాత్రులతో మాట్లాడితే తిరుపతిలో శ్రీవారి దర్శన టోకెన్లు ఇవ్వడం సరైంది కాదని భక్తులు చెప్పారన్నారు చంద్రబాబు. తమ కూటమి ప్రభుత్వ వచ్చాక టిటిడిలో భక్తులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు ఒక్కోక్కటి మార్పులు చేస్తున్నామన్నారు. ఇప్పటికే లడ్డూ ప్రసాదాలలో, అన్నప్రసాదాలలో నాణ్యతను పెంచామన్నారు. మరిన్ని మార్పులు చేసే క్రమంలో ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం అన్నారు. టిటిడి బోర్డులో చర్చించి భక్తులకు మెరుగైన సౌకర్యాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నారు. శ్రీవారి సన్నిధిలో ఎవరైనా రాజకీయాలు చేస్తే శ్రీవారి లెక్కల నుంచి తప్పించుకో లేరన్నారు చంద్రబాబు.