
క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో : ఏపీలో త్వరలో కేబినెట్ విస్తరణ జరగనుంది. మంత్రివర్గం నుంచి ముగ్గురిని తప్పించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అలాగే.. జనసేన నుంచి ఎమ్మెల్సీ నాగబాబుకు కేబినెట్‌లో స్థానం ఇవ్వనున్నారు. ఇప్పటికే జనసేనకు మూడు మంత్రి పదవులు ఇచ్చారు. నాగబాబును కేబినెట్‌లోకి తీసుకుంటే… జనసేనకు నాలుగు మంత్రులు ఇచ్చినట్టు అవుతుంది. ఇక… బీజేపీ నుంచి మరొకరిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఏపీ కేబినెట్‌లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తోపాటు 24 మంది మంత్రులు ఉన్నారు. ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. 24 మంత్రి పదవుల్లో టీడీపీ నుంచి 20 మంది, జనసేన నుంచి ముగ్గురు (పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్), బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ మంత్రి పదవుల్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇక.. కేబినెట్‌లోకి తీసుకోవడమే తరువాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న మంత్రి పదవిని నాగబాబుతో భర్తీ చేస్తారని సమాచారం. అయితే…. బీజేపీ నుంచి కూడా మరొకరికి మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ వస్తోంది. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణ చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై ప్రకటన చేస్తారని సమాచారం.
కేబినెట్ విస్తరణలో టీడీపీకి చెందిన ముగ్గురిని తప్పిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కోస్తాకు చెందిన ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలుకుతారని సమాచారం. ఆ ముగ్గురికీ ఇప్పటికే సమాచారం వెళ్లిపోయినట్టు కూడా టీడీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు పూర్తయ్యింది. త్వరలో ఏడాది కంప్లీట్ చేసుకోబోతోంది. ఈ ఏడాది పనితీరును బట్టి.. ముగ్గురు మంత్రులకు వేటు తప్పదనే వార్తలు వస్తున్నాయి.