
మెగా ఫ్యామిలీలో మరోసారి శుభవార్త వినిపించే సమయం దగ్గరపడినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్- ఉపాసన దంపతులు గతేడాది దీపావళి సందర్భంగా రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అప్పట్లో నిర్వహించిన సీమంతం వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి.
ఇప్పటికే ఉపాసన గర్భధారణ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తుండగా, తాజాగా డెలివరీ తేదీపై సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. జనవరి 31న ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే దీనిపై మెగా కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
రామ్ చరణ్- ఉపాసన దంపతులు 2012లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దాదాపు పదకొండేళ్ల నిరీక్షణ తర్వాత 2023 జూన్‌లో వీరికి ఆడబిడ్డ జన్మించింది. ఆ చిన్నారికి క్లీంకార అని పేరు పెట్టగా, ఆ పేరు వెనుక ఉన్న భావార్థం అప్పట్లో పెద్ద చర్చకే దారి తీసింది. ఇప్పుడు క్లీంకారకు తోబుట్టువులు రాబోతున్నారనే వార్తలు మెగా కుటుంబంలో ఆనందాన్ని మరింత పెంచుతున్నాయి.
ఇదిలా ఉండగా రామ్ చరణ్ ప్రస్తుతం తన కొత్త చిత్రం ‘పెద్ది’తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తుండగా, షూటింగ్ ఇంకా పూర్తికాలేదని సమాచారం. మొదట మార్చి చివరలో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ టైమ్‌లైన్ సాధ్యపడకపోవచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి.
చిత్రీకరణకు సంబంధించిన కీలక భాగాలు ఇంకా మిగిలి ఉండటంతో ‘పెద్ది’ రిలీజ్ వేసవి తర్వాతకు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా అంచనాల ప్రకారం ఈ సినిమా జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇవన్నీ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని సమాచారం.
మరోవైపు ఉపాసన డెలివరీ నేపథ్యంలో రామ్ చరణ్ షూటింగ్‌కు కొంతకాలం విరామం ఇవ్వవచ్చని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చే చరణ్.. ఈ సమయంలో పూర్తిగా కుటుంబంతోనే ఉండే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే ‘పెద్ది’ సినిమా విడుదల మరింత ఆలస్యం కావచ్చని అంచనా వేస్తున్నారు.
ALSO READ: హెచ్-1బీ వీసాదారులకు భారీ షాక్





