
తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు…? అదిగో.. ఇదిగో అంటున్నారే కానీ… మంత్రివర్గ విస్తరణ మాత్రం జరగడంలేదు..? ఉగాది అన్నారు.. ఆ తర్వాత ఈనెల మూడు, నాలుగు తేదీల్లో ఉంటుందని లీకులిచ్చారు. ఆ సమయం కూడా దాటిపోయింది. ఆశావహులు ఆశగా ఎదురుచూస్తున్నా.. మంత్రివర్గ విస్తరణ ఊసే లేదు. అంటే మళ్లీ బ్రేక్ పడినట్టేనా…? అసలు కేబినెట్ విస్తరణలో ఆలస్యానికి కారణాలు ఏంటి…? అడ్డువస్తున్న అడ్డంకులేంటి…?
తెలంగాణ కేబినెట్ ఇప్పట్లో జరిగేలా కనిపించడంలేదు. ఖాళీగా ఉందేమో ఆరు స్థానాలే.. కానీ ఆశావహుల లిస్ట్ చాంతాడంత ఉంది. మంత్రి పదవి మాకు ఇవ్వాలంటే.. మాకు ఇవ్వాలంటూ నేతలు పోటీ పడుతున్నారు. దీంతో… కేబినెట్ విస్తరణ సీఎం రేవంత్‌రెడ్డికి చుక్కలు చూపిస్తున్నారు. అందరికీ ఎలా సర్దిచెప్పాలో తెలియక పార్టీ అధిష్టానం కూడా తలలు పట్టుకున్నట్టు సమాచారం.
Also Read : HCU భూములపై గళమెత్తిన సెలబ్రిటీలు – రేవంత్ సర్కార్‌కు అనుకూలమా..? వ్యతిరేకమా..?
కేబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలను… సామాజిక సమీకరణాల బట్టి భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అయితే.. రెడ్డి సామాజిక వర్గం నేతల నుంచి పోటీ తీవ్రంగా ఉంది. నల్లగొండ, నిజమాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు రెడ్డి సామాజికవర్గం నేతలకు మంత్రి పదవులు వస్తాయని భావిస్తున్నారు. ఈ మధ్య రంగారెడ్డి జిల్లా రెడ్డి సామాజిక వర్గం నేతలు కూడా పోటీలోకి వచ్చారు. మా జిల్లాకు కూడా కేబినెట్‌లో ప్రాతినిధ్యం కావాలని లేఖ కూడా రాశారు. దీంతో… సమస్య మరింత జఠిలమైంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ.. ఎటూ తేల్చుకోలేని పరిస్థితికి వచ్చిందని… అందుకే కేబినెట్ విస్తరణ వాయిదాలు పడుతోందని ఆ పార్టీ వర్గాలే చెప్తున్నాయి.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక సలహా ఇచ్చారట. కేబినెట్‌లోని ఆరు స్థానాలతోపాటు… ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను కూడా భర్తీ చేయాలని భావిస్తున్నారట. అంటే… ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులకు మంత్రి పదవులు ఇచ్చి… డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను రెడ్డి సామాజిక వర్గం నేతలు ఇవ్వాలన ఆలోచన చేశారట. అయితే ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి..? మంత్రి పదవులను వదిలేసి డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను తీసుకునేందుకు రెడ్డి సామాజికవర్గం నేతలు అంగీకరిస్తారా..? అన్నది కూడా సందేహమే. ఈ పరిస్థితి… కేబినెట్ విస్తరణ కాంగ్రెస్‌కు పెద్ద చిక్కుముడిలా మారింది.