
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని తూర్పు వీరయ్యపాలెం గ్రామంలో పర్యటించారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండే ఎండలో, పచ్చని పొలాల మధ్య.. మంచం పైనే కూర్చుని ప్రజలతో మమేకమయ్యారు. వచ్చే సీజన్ నాటికి ఫేజ్ 1 పనులు పూర్తి చేసి వెలుగొండ జలాల్ని ప్రజలకి అందిస్తానని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. దర్శి పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా గురించి ఆసక్తికరంగా మాట్లాడారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కరువు జిల్లా గా ఉందని అన్నారు. ఇక్కడ నీళ్లు లేకపోవడంతో 1996లో తానే వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించానని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. వెలుగొండ ప్రాజెక్టు పనులు పూర్తిచేసి.. స్వయానా కృష్ణా జలాలను ఈ జిల్లాకు తీసుకువచ్చే బాధ్యత నాదేనని సీఎం హామీ ఇచ్చారు.
Read also : మంత్రి పదవి వద్దనలేదు, ఏ బాధ్యత ఇచ్చినా ఓకే: సంజయ్
అలాగే ఆగస్టు 15 నుంచి శ్రీ శక్తి పథకాన్ని ప్రారంభించనున్నట్లుగా తెలిపారు. ఈ పథకం ద్వారా ఆడబిడ్డలు మన రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చని తెలిపారు. ఈ పథకం ద్వారా ఏకంగా రెండు కోట్ల 60 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని వివరించారు. అంతేకాకుండా అప్పట్లో మహిళల కోసం డ్వాక్రా మహిళా సంఘాలను కూడా ఏర్పాటు చేసింది మన ప్రభుత్వమే అని చంద్రబాబు నాయుడు మరోసారి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు తో పాటుగా మంత్రులు అచ్చన్నాయుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కలెక్టర్ తమీమ్ అన్సారీయా తదితర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Read also : పార్టీ అధినేతగా నాయకులను క్రమశిక్షణలో ఉంచుకో.. తప్పుడు ప్రచారాలు చేయకు : CM చంద్రబాబు