ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నారు. ప్రభుత్వం వచ్చి ఏడాదే అయినా అప్పుడే దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ రెండుగా చీలిపోయింది. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టార్గెట్ చేశారనే వార్తలు వస్తున్నాయి. మంత్రుల సమావేశంలో వేములను పోలీసులు అడ్డుకోవడం తీవ్ర కలకలం రేపింది. కోమటిరెడ్డి డైరెక్షన్ లోనే వీరేశానికి అవమానం జరిగిందనే చర్చ కాంగ్రెస్ పార్టీలోనే సాగుతోంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బహిరంగంగానే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ఎక్కడ మాట్లాడినా కోమటిరెడ్డి సోదరుల సంగతి తేలుస్తానని తీన్మార్ మల్లన్న వార్నింగ్ ఇస్తున్నారు.
మిర్యాలగూడ, భువనగిరి ఎమ్మెల్యేలను కూడా మంత్రి కోమటిరెడ్డి దూరం పెట్టారనే టాక్ వస్తోంది. సీనియర్ నేత జానారెడ్డి ఇద్దరు కొడుకులు ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే జయవీర్ రెడ్డిలకు కోమటిరెడ్డితో గ్యాప్ పెరిగిందని చెబుతున్నారు.శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో మొదటి నుంచి కోమటిరెడ్డికి పొసగదు. తుంగతుర్తి కాంగ్రెస్ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. నియోజకవర్గంలో రెండుగా చీలిపోయిన కాంగ్రెస్ నేతలు.. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్లారు. పరస్పరం పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టుకున్నారు.
తాజాగా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు అసమ్మతి సెగ తగిలింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీ తీశారు. ఎమ్మెల్యే ఫోటో లేకుండా సభ నిర్వహించారు. యాదగిరిగుట్ట – మోటకొండూరులో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పై భగ్గుమంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. సిరిబోయిన మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీలో నిలిచి గెలిచిన మంగ ప్రవీణ్, బుగ్గ శ్రీనివాస్ ఇతర నాయకులకు సన్మానం చేసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యే బీర్ల ఆలయ్య తీరుపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.