జాతీయం

ఉగ్రకుట్రకు అడ్డగా అల్‌ ఫలాహ్‌ వర్సిటీ, స్థాపకుడి అక్రమాలపై ఈడీ నజర్!

Terror Den @ Al Falah University:

ఢిల్లీ కారు బ్లాస్ట్ కేసుకు సంబంధించిన విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రకుట్రకు ప్లాన్ అంతా హర్యానాలోని అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీలోనే జరిగినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వర్సిటీలో జరుపుతున్న సోదాల్లో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. 70 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ వర్సిటీని ఉగ్రవాదులు తమ అడ్డాగా మార్చుకున్నట్లు తేలింది.

ఉగ్రడెన్ గా 13వ నంబర్‌ హాస్టల్ గది

అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీలోని బాయ్స్‌ హాస్టల్‌ 13వ నంబర్‌ గది ఉగ్రవాదులు తమ డెన్ గా మార్చుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన డాక్టర్‌ ముజమ్మిల్‌ అదే గదిలో ఉండేవాడు. తాజాగా అరెస్ట్ అయిన ఉగ్రవాదులంతా ఆ గదిలోనే కలుసుకునేవారు. దాదులకు సంబంధించిన ప్రణాళికలు వేసేవారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్‌ ఉమర్‌ నబీ ఇదే హాస్టల్‌లో 4వ నంబర్‌ గదిలో ఉండేవాడు. ఆ గదిలో కూడా ఉగ్ర డాక్టర్లు సమావేశమయ్యేవారు. క్యాంప్‌సలో ఇంకా ఎవరెవరు ఈ ముఠాతో సంబంధాలు కలిగి ఉన్నారనే విషయంపై అధికారులు లోతుగా విచారణ జరపుతున్నారు. పోలీసులు అరెస్టు చేసిన మహిళా ఉగ్రవాది, అల్‌ ఫలాహ్‌ వర్సిటీ మెడికల్‌ కాలేజీ డాక్టర్‌ షహీన్‌కు పాకిస్థాన్‌ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు.

వెలుగులోకి వస్తున్న వర్సిటీ స్థాపకుడి అక్రమాలు

ఉగ్ర వైద్యులకు అడ్డాగా మారిన అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు జావేద్‌ అహ్మద్‌ సిద్ధిఖి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఆయనపై పలు కేసులు నమోదలయ్యాయి. జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఎక్కువ లాభాలు వస్తాయంటూ రూ.7.5 కోట్లు డిపాజిట్లు సేకరించి, మోసం చేసిన కేసులో ఆయన మూడేళ్లు జైలు జీవితం గడిపాడు. మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌ జిల్లా అంబేద్కర్‌ నగర్‌కు చెందిన సిద్ధిఖి.. అల్‌ ఫలాహ్‌ చారిటబుల్‌ ట్రస్టు కింద తొమ్మిది సంస్థలను స్థాపించారు. ఇవన్నీ ఢిల్లీలోని జామియా నగర్‌లో అల్‌ ఫలాహ్‌ హౌజ్‌ పేరిట ఉన్న ఒకే భవనం అడ్రస్ తో రిజిస్టర్ చేశాడు. ఇందులో యూనివర్సిటీ తప్ప మిగతా సంస్థలన్నీ 2019 ఏడాది వరకే కొనసాగాయి. తర్వాత కొన్నింటిని మూసేశాడు. తాజా వ్యవహారంతో అల్‌ ఫలాహ్‌ ప్రైవేటు యూనివర్సిటీకి న్యాక్‌ నోటీసులు జారీ చేసింది. వర్సిటీ పరిధిలోని ఇంజనీరింగ్‌, ఉపాధ్యాయ విద్య కాలేజీలకు న్యాక్‌ నుంచి ఎలాంటి గుర్తింపు లేకున్నా.. న్యాక్‌  ఏ గ్రేడ్‌ గుర్తింపు ఉన్నట్టుగా వెబ్‌ సైట్ లో పేర్కొనడంపై చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది. అటు ఆల్ ఇండియా మెడికల్ యూనివర్సిటీ అసోసియేషన్ ఈ కాలేజీ సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించింది. కాలేజీ వ్యవహారాలపై దర్యాప్తు అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button