
AI: సాధారణంగా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు అనగానే పెద్ద పరిమాణం, భారీ బరువు అనే భావన అందరికీ ఉంటుంది. కానీ ఆ సాంప్రదాయ ఆలోచనలకే సవాల్ విసిరేలా అమెరికాకు చెందిన ఒక స్టార్టప్ ప్రపంచంలోనే అతి చిన్న ఏఐ ఆధారిత సూపర్ కంప్యూటర్‌ను అభివృద్ధి చేసింది. పవర్ బ్యాంక్ సైజులో ఉండే ఈ విప్లవాత్మక పరికరానికి టినీ ఏఐ పాకెట్ ల్యాబ్ అని పేరు పెట్టారు. టెక్నాలజీ రంగంలో ఇది ఒక గేమ్‌చేంజర్‌గా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ టినీ ఏఐ పాకెట్ ల్యాబ్ పరిమాణం కేవలం 14.2 × 8 × 2.53 సెం.మీ. మాత్రమే. బరువు కూడా సుమారు 300 గ్రాములే. పరిమాణంలో చిన్నదిగా ఉన్నప్పటికీ, పనితీరులో మాత్రం ఇది ఒక సూపర్ కంప్యూటర్‌కు ఏమాత్రం తగ్గదని చెబుతున్నారు. దాని అద్భుతమైన సైజ్, సామర్థ్యాల కారణంగా దీనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నుంచి ‘ప్రపంచంలోనే అతి చిన్న మినీ పీసీ (100B LLM లోకల్‌గా నడిపే సామర్థ్యం ఉన్నది)’గా ధృవీకరణ కూడా లభించింది.
ఈ చిన్న సూపర్ కంప్యూటర్ యొక్క అసలు బలం దాని లోపలి హార్డ్‌వేర్ మరియు ఏఐ సామర్థ్యాల్లోనే దాగుంది. 120 బిలియన్ పారామీటర్లతో కూడిన పెద్ద లాంగ్వేజ్ మోడల్స్‌ను కూడా ఇది సులభంగా నడిపించగలదు. ముఖ్యంగా ఇంటర్నెట్ లేదా క్లౌడ్ అవసరం లేకుండానే పూర్తిగా ఆఫ్‌లైన్‌లో పనిచేయడం దీని ప్రత్యేకత. అవసరమైతే క్లౌడ్ ద్వారా కూడా వేగంగా రన్ చేయగల సామర్థ్యం ఇందులో ఉంది.
టినీ ఏఐ పాకెట్ ల్యాబ్‌లో ఆర్మ్‌వి9.2 ఆధారిత 12-కోర్ CPU, 80GB LPDDR5X ర్యామ్‌ను అందించారు. అలాగే 160 TOPS dNPU, 30 TOPS iNPUతో మొత్తం 65W పవర్ ఎన్వలప్‌లో పనిచేస్తుంది. టర్బోస్పార్స్, పవర్ ఇన్ఫర్ వంటి ఆధునిక టెక్నాలజీల ద్వారా ఇది జీపీయూ స్థాయి పనితీరును అందిస్తుందని టెక్ నిపుణులు వివరించారు. GPT-OSS, లామా, క్వెన్, మిస్ట్రల్ వంటి ప్రముఖ ఓపెన్-సోర్స్ ఏఐ మోడల్స్‌కు ఇది పూర్తి మద్దతు ఇస్తుంది.
డేటా భద్రత విషయంలోనూ ఈ పరికరం ప్రత్యేకంగా నిలుస్తోంది. బ్యాంక్-లెవెల్ ఎన్‌క్రిప్షన్‌తో పాటు లోకల్ ప్రాసెసింగ్ ఉండటంతో, వినియోగదారుల డేటా ఎక్కడికీ వెళ్లకుండా పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. క్రియేటర్లు, డెవలపర్లు, సెన్సిటివ్ డేటాతో పనిచేసే సంస్థలకు ఇది ఎంతో ఉపయోగకరమని చెబుతున్నారు. వ్యక్తిగత డాక్యుమెంట్లు, ఫోటోలు, ఫైల్స్‌ను లోకల్‌గా ఇండెక్స్ చేసి, ఒక పర్సనల్ ఏఐ అసిస్టెంట్‌లా కూడా ఇది పనిచేస్తుంది.
పోర్టబిలిటీ విషయంలో టినీ ఏఐ పాకెట్ ల్యాబ్‌కు తిరుగులేదు. పవర్ బ్యాంక్ సైజులో ఉండటంతో జేబులో పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఫ్లైట్‌లో, ట్రైన్‌లో, అడవిలో, గ్రామాల్లో, ఆఫీసులో.. ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా కూడా పూర్తి ఏఐ సామర్థ్యంతో ఇది పనిచేస్తుంది. ఒకసారి కొనుగోలు చేస్తే తర్వాత ఎటువంటి సబ్‌స్క్రిప్షన్ ఫీజులు అవసరం లేకపోవడం కూడా మరో ప్రధాన ఆకర్షణగా మారింది. ChatGPT Plus, Claude, Gemini వంటి సేవలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
ఫాస్ట్ రెస్పాన్స్ కూడా ఈ పరికరం బలమైన అంశమే. క్లౌడ్ లేటెన్సీ లేకుండా లోకల్‌గా 30 నుంచి 50 టోకెన్స్ ప్రతిసెకనుకు ప్రాసెస్ చేయగలదు. డెవలపర్లకు ఇది మరింత అనుకూలంగా ఉండేలా ఒకే క్లిక్‌తో ComfyUI, Flowise, OpenManus, Ollama వంటి ఏఐ టూల్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకునే అవకాశం కల్పించారు. 65W వరకు పవర్ ఉపయోగించే ఈ డివైస్‌ను పెద్ద పవర్ బ్యాంక్‌తో కూడా గంటల తరబడి నడిపించవచ్చు.
అదే విధంగా OTA అప్‌డేట్స్ ద్వారా కొత్త మోడల్స్, ఫీచర్లు ఆటోమేటిక్‌గా అందుబాటులోకి వస్తాయి. అవసరమైనప్పుడు మాత్రమే వై-ఫైకి కనెక్ట్ అవ్వచ్చు. మొత్తంగా చెప్పాలంటే, ఇది ఒక చిన్న పరికరం కాదు.. మీ జేబులో ఉండే మీ సొంత సూపర్ కంప్యూటర్, మీ పర్సనల్ ChatGPT అని చెప్పవచ్చు. ఈ కొత్త ఏఐ ఆధారిత మినీ కంప్యూటర్ 2026లో మార్కెట్‌లోకి రావడానికి సిద్ధమవుతుండటంతో, టెక్ ప్రపంచం మొత్తం దీనిపై ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ALSO READ: ALERT: రీల్స్ అతిగా చూస్తున్నారా?





