
కోదాడ, జూలై 2 (క్రైమ్ మిర్రర్) : వాకింగ్‌కు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కోదాడ పట్టణంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది.
స్థానికుల కథనం మేరకు, పట్టణంలోని ఎమ్మెస్ కళాశాల వెనకవైపున నివాసం ఉండే షేక్ సల్మాన్ (23) ప్రతి రోజు మాదిరిగానే బుధవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లాడు. ఉత్తమ్ పద్మావతి నగర్ ఎదురుగా ఉన్న సర్వీసు రోడ్డుపై నడుస్తుండగా, అకస్మాత్తుగా కాలుజారి పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్‌ను తాకిన సల్మాన్‌కు బలమైన విద్యుత్ షాక్ తగిలింది. ఈ దుర్ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడు పట్టణంలోని ఓ రెడీమేడ్ దుస్తుల దుకాణంలో గుమ్మస్తాగా పనిచేస్తున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.