పైన కనిపిస్తున్న చిన్నారి ఫోటో చూసి చాలా మందికి ఆసక్తి కలుగుతోంది. ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల సరసన నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి చిన్ననాటి చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో తక్కువ సినిమాలు చేసినప్పటికీ భారీ అభిమాన వర్గాన్ని సంపాదించుకున్న ఆమె.. అప్పట్లో స్టార్ హీరోలతో కలిసి నటించేందుకు నిర్మాతలు పోటీ పడేంత క్రేజ్‌ను పొందింది. తాజాగా తన చిన్నప్పటి ఫోటోలను పంచుకోవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి మరెవరో కాదు.. ప్రముఖ నటి సమీరా రెడ్డి. ముంబైకు చెందిన ఈ అందాల భామ ఒకప్పుడు దక్షిణాది సినీ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించింది. తెలుగులో తక్కువ సినిమాలే చేసినప్పటికీ ఆమెకు ఉన్న క్రేజ్ ఎంతో ప్రత్యేకం. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘నరసింహుడు’, ‘అశోక్’ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే చిరంజీవితో కలిసి ‘జై చిరంజీవ’ సినిమాలో కనిపించి తన నటనతో మెప్పించింది. తమిళంలో కూడా స్టార్ హీరోలతో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
కెరీర్ మంచి దశలో ఉన్న సమయంలోనే 2014లో వ్యాపారవేత్త అక్షయ్ వార్డేను వివాహం చేసుకుని సినిమాలకు దూరమైంది. అనంతరం కుటుంబ జీవితానికే ప్రాధాన్యం ఇస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించింది. 2015లో కుమారుడు హన్స్, 2019లో కూతురు నైరా జన్మించారు. పెళ్లి తర్వాత సినిమా ప్రపంచానికి దూరమైనప్పటికీ అభిమానులతో అనుబంధాన్ని కొనసాగిస్తూ సోషల్ మీడియాలో మాత్రం చురుకుగా ఉంటుంది.
ప్రస్తుతం సమీరా రెడ్డి నిత్యం తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా చిన్ననాటి ఫోటోలను షేర్ చేయడంతో అవి క్షణాల్లోనే వైరల్‌గా మారాయి. గుండుతో ఉన్న తన బాల్య చిత్రాలను చూసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, దాదాపు 13 సంవత్సరాల తర్వాత ‘చిమ్ని’ అనే హారర్ చిత్రంతో మళ్లీ తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ రీఎంట్రీపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ALSO READ: పీఎఫ్ వడ్డీ రేట్లను పెంచుతారా?.. కేంద్రం క్లారిటీ

