
సెల్ ఫోన్ లోడ్ తో వెళ్తున్న లారీ దారి దోపిడికి గురైన సంఘటన కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం టేక్రియాల్ బైపాస్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది.పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాదు నుంచి నిజామాబాద్ వైపు సెల్ ఫోన్ లోడ్ తో వెళ్తున్న లారీని బైక్ పై గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ముఖానికి కర్చీఫ్ లు ధరించి వచ్చి లారీ డ్రైవర్ ను బెదిరించి లారీలోంచి సుమారు 4 లక్షల విలువ చేసే సెల్ ఫోన్లను దుండగులు ఎత్తుకెళ్లారు. దీంతో ఒక్కసారిగా లారీ డ్రైవర్ భయాందోళనకు గురయ్యాడు. అనంతరం బాధితుడు
స్థానిక దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
లారీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు చేపట్టారు.బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవునిపల్లి ఎస్సై రంజిత్ తెలిపారు.గత కొద్ది నెలల క్రితం ఇదే ప్రాంతంలో కారును వెంబడించి కారులోని వ్యక్తులపై దాడి చేసి ల్యాప్ టాప్,నగదును ఎత్తుకెళ్లారు.జాతీయ రహదారిపై నిత్యం రద్దీగా వెళ్లే వాహనాలు ప్రయాణిస్తున్నప్పటికీ దుండగులు ఈ విధంగా వాహనదారులపై దాడులకు పాల్పడుతూ ఉండడంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రిపూట పోలీస్ పెట్రోలింగ్ పెంచాలంటూ స్థానికులు డిమాండ్ చేశారు.