మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో సంచలనం రేపిన ఓ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. తనతో కలిసి ఎంబీఏ చదువుతున్న ప్రియురాలిని ఓ యువకుడు అత్యంత దారుణంగా హింసించి హత్య చేయడం కలకలం రేపుతోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా విచారిస్తున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 10న 24 ఏళ్ల యువతి తన స్నేహితురాలి పుట్టినరోజు వేడుకకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు తెలిపి ఇంటి నుంచి బయలుదేరింది. అయితే రాత్రి 11 గంటల సమయంలో ఆమె ఫోన్ నుంచి తండ్రికి “పాప ఇంటికి రాదు” అని సందేశం చేరింది. అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో ఆమె చదువుతున్న ఆమె కాలేజీ వాట్సాప్ గ్రూప్‌లో అసభ్యకర దృశ్యాలు ప్రత్యక్షమయ్యాయి. ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
ఇంతలో 3 రోజుల తరువాత నిందితుడు అద్దెకు ఉంటున్న గది నుంచి తీవ్ర దుర్వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లగా యువతి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. ప్రాథమిక దర్యాప్తులో గొంతు నులిమి హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు.
విచారణలో నిందితుడు చెప్పిన విషయాలు పోలీసులనే దిగ్భ్రాంతికి గురిచేశాయి. యువతి తనకు శారీరక సంబంధానికి నిరాకరించడంతో ఆమెపై బలవంతంగా దాడి చేసినట్లు ఒప్పుకున్నాడు. ప్రతిఘటించడంతో చేతులు కాళ్లు కట్టేసి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు తెలిపాడు. అనంతరం గదిలోనే కొంతసేపు గడిపి, ఆపై అక్కడి నుంచి పరారైనట్లు వెల్లడించారు.
నేరం చేసిన తరువాత యువతి ఫోన్‌ను ధ్వంసం చేసి ముంబై నగరానికి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ కొన్ని మూఢాచార పద్ధతులను అనుసరించి తాను చేసిన నేరానికి క్షమాపణ కోరేందుకు ప్రయత్నించినట్లు విచారణలో వెల్లడైంది. సంబంధిత రాష్ట్ర పోలీసుల సహకారంతో నిందితుడిని అరెస్ట్ చేసి ఇందోర్‌కు తరలించారు.
విచారణ సమయంలో నిందితుడు నిర్లక్ష్యంగా ప్రవర్తించడం, జరిగిన ఘటనపై పశ్చాత్తాపం లేకుండా స్పందించడం అతని మానసిక స్థితిపై అనుమానాలు రేకెత్తిస్తోంది. యువతి ఇతరులతో మాట్లాడుతోందన్న అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
