బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేయడంపై చెలరేగిన వివాదం తాజాగా మరో మలుపు తిరిగింది. ఆమె ఆలయ సందర్శనను తప్పుబడుతూ ముస్లిం మత పెద్ద ఫత్వా జారీ చేయడంపై పరమార్థ్ నికేతన్ ఆశ్రమాధిపతి స్వామి చిదానంద సరస్వతి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంచి పనులు చేస్తున్న వారిని ప్రోత్సహించాల్సింది పోయి, వారిపై ఫత్వాలు జారీ చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.
శుక్రవారం హరిద్వార్‌లో మీడియాతో మాట్లాడిన స్వామి చిదానంద.. సమాజానికి మేలు చేసే మార్గంలో పయనించే వ్యక్తులను విమర్శించడం సమంజసం కాదన్నారు. ఎవరైనా తప్పు చేసినప్పుడు ఆందోళన వ్యక్తం చేయడంలో అర్థం ఉంటుందని, కానీ మంచి మార్గంలో నడుస్తున్న వారిని లక్ష్యంగా చేసుకోవడం ఎందుకో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. సమాజ సంక్షేమం కోసం కృషి చేసే వారిని అభినందించాలి తప్ప, ఇలాంటి ఆంక్షలతో ఇబ్బందులకు గురిచేయకూడదని స్పష్టం చేశారు.
సారా ఆలయ సందర్శనపై ఫత్వా ఎందుకంటే?
ఇటీవల ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ సారా అలీ ఖాన్ కేదార్నాథ్ ఆలయంలో పూజలు చేయడాన్ని తప్పుబట్టారు. ఇస్లామిక్ నిబంధనల ప్రకారం ఈ చర్య నిషిద్ధమని పేర్కొంటూ ఫత్వా జారీ చేశారు. ఆలయాన్ని సందర్శించి పూజలు చేయడం బహుదేవతారాధన కిందకు వస్తుందని, అందువల్ల సారా అలీ ఖాన్ పశ్చాత్తాపం వ్యక్తం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సంత్ సమితి నేత కూడా స్పందన
ఈ వివాదంపై అఖిల భారతీయ సంత్ సమితి ప్రధాన కార్యదర్శి స్వామి జితేంద్రానంద సరస్వతి సైతం స్పందించారు. ముస్లిం మత పెద్దలు తమ సమాజానికి సంబంధించిన విషయాలపై నిర్ణయాలు తీసుకోవచ్చని వ్యాఖ్యానించారు. దాండియా వేడుకల్లో ముస్లిం యువకులు పాల్గొంటున్నప్పుడు, వారి కుటుంబాల్లోని మహిళలు ఎందుకు పాల్గొనకూడదని ప్రశ్నించారు.
అదే సమయంలో హిందూ దేవాలయాలు కేవలం పర్యాటక ప్రదేశాలు కావని, ఆగమ శాస్త్ర సంప్రదాయాలకు అనుగుణంగా నడిచే ఆధ్యాత్మిక క్షేత్రాలని ఆయన పేర్కొన్నారు. దేవతపై విశ్వాసం ఉన్నవారే ఆలయాలకు రావాలన్న మద్రాస్ హైకోర్టు తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించారు.
సారా అలీ ఖాన్ సినిమాలతో పాటు ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడం ద్వారా కూడా ఆమె తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా కేదార్నాథ్ ఆలయ సందర్శనపై మొదలైన ఈ వివాదం, మత స్వేచ్ఛ, వ్యక్తిగత విశ్వాసాల అంశాలపై మరోసారి చర్చకు దారితీసింది.
also read: చిత్ర పరిశ్రమలో విషాదం… సీనియర్ నటి వత్సల రాజగోపాల్ కన్నుమూత..
