Homeసినిమాచిత్ర పరిశ్రమలో విషాదం... సీనియర్ నటి వత్సల రాజగోపాల్ కన్నుమూత..

చిత్ర పరిశ్రమలో విషాదం… సీనియర్ నటి వత్సల రాజగోపాల్ కన్నుమూత..

దక్షిణాది చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి వత్సల రాజగోపాల్ (92) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో వచ్చే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. చెన్నైలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్తతో సినీ వర్గాల్లో విషాదం నెలకొంది.

నాటకరంగం నుంచి నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన వత్సల రాజగోపాల్.. అరవై ఏళ్ల వయసులో వెండితెరపైకి అడుగుపెట్టారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించిన ‘రోజా’ సినిమాతో సినీ రంగంలోకి ప్రవేశించారు. అనంతరం తమిళం, తెలుగు భాషల్లో కలిపి 400కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు చేరువయ్యారు.

తెలుగు సినిమాల్లోనూ ఆమె ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అదుర్స్’ చిత్రంలో బామ్మ పాత్రలో కనిపించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. వయసుకు తగ్గ పాత్రలతో పాటు విభిన్నమైన సహాయక పాత్రల్లోనూ తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైనా వత్సల తన ప్రతిభను చాటుకున్నారు. పలు టెలివిజన్ సీరియళ్లలో నటిస్తూ టీవీ ప్రేక్షకులకు కూడా సుపరిచితమయ్యారు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు, నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. వత్సల రాజగోపాల్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

నాటకరంగం నుంచి మొదలైన ఆమె నటనా ప్రస్థానం.. వందలాది సినిమాలు, టీవీ సీరియళ్ల వరకు కొనసాగింది. తన సహజమైన నటనతో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన వత్సల రాజగోపాల్ మరణం దక్షిణాది సినీ పరిశ్రమకు తీరని లోటు.

also read: డీఎస్పీ భారీ ప్రయోగం..100 మంది జానపద కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్ సిద్ధం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు