క్రైమ్ మిర్రర్ : బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన కాల్పుల ఘటనలో దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో పోలీసులు వెల్లడించిన వివరాలు చర్చనీయాంశంగా మారాయి. దర్యాప్తు వర్గాల సమాచారం ప్రకారం, నిందితుల అసలు లక్ష్యం టైగర్ ష్రాఫ్ కాదని, తొలుత మరో బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్‌పై దాడికి ప్రణాళిక రూపొందించినట్లు అనుమానిస్తున్నారు.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులు మొదట ముంబైలోని బాంద్రాలో ఉన్న సల్మాన్ ఖాన్ నివాసం వద్ద రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. అయితే అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండటంతో తమ ప్రణాళికను మార్చుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. అనంతరం టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం.
టైగర్ ష్రాఫ్‌కు పోలీసు భద్రత లేదనే విషయాన్ని నిందితులు సోషల్ మీడియా రీల్స్ ద్వారా తెలుసుకున్నట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. అలాగే ఆయన ప్రతి ఆదివారం జుహు ప్రాంతంలోని ఫుట్‌బాల్ మైదానానికి వస్తుంటారని తెలుసుకుని రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన కారుపై కాల్పులు జరిపిన ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భద్రతను మరింత పెంచినట్లు సమాచారం. భవనం లోపల, బయట, పరిసర రహదారుల్లో పోలీసు సిబ్బందిని మోహరించినట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేసే వ్యక్తులను కూడా లక్ష్యంగా చేసుకుంటామని బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.
మరోవైపు, ఈ కేసులో ఆయుధాల సరఫరాతో సంబంధం ఉందనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వారిలో హర్యానాకు చెందిన కునాల్, సుమిత్తో పాటు ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాధ, బబిత ఉన్నారు. పోలీసుల వివరాల ప్రకారం, కునాల్ అమృత్సర్ నుంచి పిస్టల్, బుల్లెట్లు సేకరించి, రాధ సహాయంతో వాటిని ముంబైకి తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆ బ్యాగ్‌ను ఓ మైనర్ బాలుడికి అప్పగించినట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారం వెనుక అనిల్ పండిత్ పాత్ర ఏమైనా ఉందా? లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఈ కేసుకు ఎలాంటి సంబంధాలున్నాయి? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
also read : రెప్పపాటులో ఘోరం.. లోయలో పడిపోయిన బస్సు, ఇద్దరు మృతి
