-
ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణలు సతమతం
-
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిందే
-
లేకుంటే పొలిటికల్ కెరీర్ క్లోజ్
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వైసీపీ ముందుగానే సన్నాహాలు ప్రారంభించింది. పెద్ద ఎత్తున అభ్యర్థులను ప్రకటిస్తోంది. అయితే ఈ ఎన్నికలు సీనియర్లకు ప్రాణ సంకటంగా మారుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోకపోతే పొలిటికల్ కెరీర్ క్లోజ్ కాక తప్పదు.
అందుకే బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని ముందుగానే వ్యూహరచన చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులకు ఇది ఒక అగ్ని పరీక్ష. విజయనగరం కార్పొరేషన్ తో పాటు మున్సిపాలిటీలను గెలిపించుకోవాల్సిన బాధ్యత బొత్స సత్యనారాయణ పై ఉంది.
ఇంకోవైపు శ్రీకాకుళం కార్పొరేషన్ తో పాటు ఇతర మున్సిపాలిటీల విషయంలో కూడా ధర్మాన ప్రసాదరావుకు బాధ్యత ఉంది. దీంతో ఆ ఇద్దరూ సీనియర్లు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు.
-
కుటుంబంలో చీలికతో బొత్స..
విజయనగరంలో చిన్న శ్రీను పార్టీకి గుడ్ బై చెప్పడంతో బొత్స సత్యనారాయణ కుటుంబంలో పూర్తిగా చీలిక వచ్చింది. ముఖ్యంగా బొత్స సత్యనారాయణకు ఇది షాకింగ్ విషయం. ఏం చేయలేని స్థితి ఆయనది. ఈ పరిస్థితుల్లో ఆయన మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామితో చేతులు కలిపారు.
పేరుకే ఆ ఇద్దరు ఒకే పార్టీ కానీ.. ఇద్దరు మధ్య విభేదాలు కొనసాగుతూ వచ్చాయి. గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా ఆ ఇద్దరి నేతల మధ్య అంతగా సఖ్యత ఉండేది కాదు.
కానీ ఇప్పుడు కుటుంబంలో చీలిక వచ్చిన తర్వాత బొత్స కోలగట్లతో చేతులు కలిపారు. కోలగట్ల వీరభద్ర స్వామి కుమార్తె శ్రావణిని విజయనగరం మేయర్ అభ్యర్థిగా రంగంలోకి దించారు. అయితే అక్కడ కూటమి బలంగా ఉంది. అక్కడ వైసీపీకి ఇబ్బందులు తప్పేలా లేవు.
-
సరైన అభ్యర్థి లేక..
అదే సమయంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కు అగ్నిపరీక్ష. ఆయన సొంత నియోజకవర్గం శ్రీకాకుళం. అక్కడ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. పొత్తులో భాగంగా ఈ సీటును జనసేనకు కేటాయించారు. ఇక్కడ వైసిపికి సరైన అభ్యర్థి లేరు. ఈ పరిస్థితుల్లో ధర్మాన కొత్త ఎత్తుగడ వేశారు.
టిడిపిలో సుదీర్ఘకాలం ఉన్న గుండ కుటుంబాన్ని వైసీపీలోకి రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ మంత్రి గుండ అప్పలసూర్య నారాయణ భార్య, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవిని వైసిపి తరఫున మేయర్ అభ్యర్థిగా ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే ఆమె వైసీపీలో చేరేందుకు కొంత ఇబ్బంది పడుతున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ కొత్త అభ్యర్థిని రంగంలోకి దించింది టిడిపి. ధర్మాన ప్రసాదరావు పై టిడిపి అభ్యర్థి శంకరరావు ఏకంగా 50 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
అందుకే ఇక్కడ మేయర్ అభ్యర్థి విషయంలో కూడా వైసిపికి అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిని వైసీపీలోకి రప్పించి పోటీ చేయించినా.. ఆమె ఓటమి చవిచూసినా ధర్మాన పొలిటికల్ కెరీర్ ముగిసినట్టే.
