-
రాష్ట్రంలోనే అతిపెద్ద పట్టణ స్థానిక సంస్థ జీవీఎంసీ
-
120 డివిజన్లతో పది నియోజకవర్గాల పరిధిలో
-
క్యాబినెట్ హోదాతో కూడిన మేయర్ పదవి
-
ముందుగానే అభ్యర్థిని ప్రకటించిన టిడిపి
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల్లో అతిపెద్దది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్. దాదాపు 18,50,000 ఓట్లు ఇక్కడ ఉన్నాయి. దాదాపు పది నియోజకవర్గాల వరకు ఈ జీవీఎంసీ పరిధి విస్తరించి ఉంది. 120 డివిజన్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్ గ్రేటర్ విశాఖ.
అయితే గత రెండు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవలేదు. అందుకే ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పొత్తులో భాగంగా బిజెపితో పాటు జనసేన సైతం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని ఆశించాయి.
కానీ అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. ఆ పార్టీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు ముక్కు ముత్యాల నాయుడు కుమార్ డాక్టర్ శ్రావణి పేరును ఖరారు చేశారు. దీంతో ఇక్కడ పోటీ ప్రతిష్టాత్మకంగా మారనుంది.
-
వైసీపీలో అయోమయం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మల్లగుల్లాలు పడుతోంది. బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని భావిస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పై జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఆమె అయితే గట్టి పోటీ ఇవ్వగలరు అని భావిస్తున్నట్లు సమాచారం.
అయితే మేయర్ గా పోటీ చేసేందుకు కళ్యాణి వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అధినేత మరింత ఒత్తిడి పెంచితే మాత్రం ఆమె పోటీ చేయడం ఖాయం. అయితే నగరంలో కూటమి ఏకపక్షంగా ఉంది. దాదాపు అన్ని డివిజన్లలో బలంగా ఉంది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి షాక్ తప్పేలా లేదు.
-
చాలా పెద్ద పరిధి..
దాదాపు నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో సైతం జీవీఎంసీ విస్తరించి ఉంది. విశాఖ తూర్పు, విశాఖ పశ్చిమ, విశాఖ దక్షిణ, విశాఖ ఉత్తర నియోజకవర్గాలతో పాటు గాజువాక, పెందుర్తి, అనకాపల్లి, భీమిలి నియోజకవర్గాల పరిధిలో 120 డివిజన్లతో ఉంది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏకపక్షంగా అన్ని స్థానాల్లో కూడా కూటమి విజయం సాధించింది. మూడు పార్టీల మధ్య చక్కటి సమన్వయం ఉంది. ఆపై మేయర్ అభ్యర్థిగా సీనియర్ నేత ముక్కు ముత్యాల నాయుడు కుమార్తె బరిలో దిగుతున్నారు. ఇది ఎంతగానో కలిసి వచ్చే అంశం. చూడాలి చివరకు ఫలితం ఎలా ఉండబోతుందో.
