క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టింది బిజెపి. ముఖ్యంగా మహబూబ్నగర్ – రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల స్థానం నుంచి బలమైన అభ్యర్థిని బరిలో దించాలని చూస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పార్టీని నడిపించాల్సిన అత్యున్నత పదవిలో ఉన్న నేతను.. ఇలా ఒక నిర్దిష్ట నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి దింపడం తీవ్రమైన రాజకీయ సాహసం అని విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణ నాయకుడిగా పోటీ చేయడం వేరు, స్వయంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఎన్నికల పరీక్షను ఎదుర్కోవడం వేరు. ఒకవేళ ఇక్కడి ఫలితం ఏమాత్రం ప్రతికూలంగా వచ్చినా.. ఆ ప్రభావం కేవలం రామచంద్రరావు రాజకీయ ప్రతిష్ట కే కాకుండా.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బిజెపి సమిష్టి ఆత్మస్థైర్యం పై పిడుగుపాటులా మారనుంది.
మారిన ఫలితంతో..
ఈ పట్టభద్రుల స్థానానికి సంబంధించి చరిత్రను పరిశీలిస్తే బిజెపికి కష్టంగా మారనుంది. 2015లో ఇదే నియోజకవర్గం నుంచి గెలిచారు రామచందర్రావు. మండలిలో బిజెపి గళాన్ని బలంగా వినిపించారు. 2021 లో జరిగిన ఎన్నికల్లో మాత్రం టిఆర్ఎస్ అభ్యర్థి సురభి వానిదేవి చేతిలో భారీ ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఒకసారి విజయం, మరోసారి భారీ పరాజయం చూసిన ట్రాక్ రికార్డు ఉన్న నేపథ్యంలో.. విద్యావంతులు, ఉద్యోగులు, నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా ఉండే ఈ నియోజకవర్గంలో.. గెలుపు అనేది ముందస్తుగా అంచనా వేయలేని సంక్లిష్టమైన అంశం. పట్టభద్రుల మూడు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఇలాంటి సెన్సిటివ్ స్థానంలో.. స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడిని పోటీకి దింపడం శ్రేయస్కరం కాదు అనేది విశ్లేషకుల మాట.
యువ నేతలకు ఇస్తే…
తెలంగాణ ఉద్యమ సమయంలో యాక్టివ్ గా పని చేసిన చాలామంది బిజెపి యువనేతలు ఉన్నారు. అటువంటి వారిని ఎంపిక చేసి టికెట్ ఇస్తే మాత్రం బిజెపికి మెరుగైన ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఏబీవీపీ, యువ మోర్చా నేపథ్యం ఉన్న బలమైన యువ నాయకుడిని బరిలోకి దించితే.. అధికార కాంగ్రెస్, విపక్ష గులాబీ పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిరుద్యోగ యువతను, పట్టభద్రులను ఆకట్టుకోవడం చాలా సులభంగా మారుతుంది. కొత్త నాయకుడిని నిలబెడితే ఎన్నిక ఎలా ఉన్నా.. పార్టీ క్యాడర్ అంతా సంఘటితంగా పోరాటం చేయడం ఖాయం. ఒకవేళ ఫలితం తేడా వస్తే అది ఒక సాధారణ నియోజకవర్గ ఫలితంగానే చూస్తారు తప్ప.. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై వైఫల్యం ముద్ర పడదు. కానీ రామచందర్రావు రంగంలోకి దిగితే.. ప్రత్యర్థి పార్టీలన్నీ కచ్చితంగా ఉమ్మడిగా ఆయనను ఓడించడమే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతాయి. ఫలితంగా రాష్ట్ర అధ్యక్షుడు ఇమేజ్ భారీగా డామేజ్ కావడం ఖాయం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని చెబుతున్న బిజెపికి సైతం ఇది ఇబ్బంది కరం. ఒకవేళ రామచంద్రరావుని బరిలో దింపితే.. గులాబీ పార్టీ బలహీనమైన అభ్యర్థిని దించి కచ్చితంగా బిజెపికి దెబ్బ కొడుతుంది. కాంగ్రెస్ పార్టీకి తామే ప్రత్యామ్నయం అని చెప్పేందుకు వెనుకడుగు వెయ్యదు కూడా.
ఇవి కూడ చదవండి:
- దొరికిన బ్యాగులో రూ.9.48 లక్షల విలువైన విదేశీ కరెన్సీ.. ఆశపడకుండా పోలీసులకు అప్పగించిన వ్యక్తి!
-
అన్నమయ్య జిల్లాలో దారుణం.. బీర్ బాటిల్తో దాడి చేసి భార్యను హతమార్చిన భర్త!
-
ప్రియుడికి బెయిల్ కోసం డ్రగ్స్ దందా.. ప్రియురాలు అరెస్ట్!
-
పునీత్ రాజ్కుమార్ చివరి క్షణాలు.. అప్పూ మరణంపై డాక్టర్ కీలక వ్యాఖ్యలు!
