Homeజాతీయంమరాఠీ భాషపై వ్యాఖ్యలు.. వివాదం ముదరడంతో మంత్రి సర్నాయక్‌కు సంజయ్ దత్ ఫోన్

మరాఠీ భాషపై వ్యాఖ్యలు.. వివాదం ముదరడంతో మంత్రి సర్నాయక్‌కు సంజయ్ దత్ ఫోన్

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ చేసిన ఓ వ్యాఖ్య మహారాష్ట్రలో రాజకీయ వివాదానికి దారితీసింది. మరాఠీ భాషపై ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో.. సంజయ్ దత్ స్వయంగా మహారాష్ట్ర మంత్రి, శివసేన నేత ప్రతాప్ సర్నాయక్‌కు ఫోన్ చేసి వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను సరదాగా చేసినవేనని, వాటిని ఎవరైనా మరోలా అర్థం చేసుకుని ఉంటే క్షమించాలని కోరినట్లు మంత్రి కార్యాలయం వెల్లడించింది.

ఇటీవల థానేలో ప్రతాప్ సర్నాయక్‌కు చెందిన ‘సంస్కృతి యువ ప్రతిష్ఠాన్’ ఆధ్వర్యంలో దహీ హండీ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంజయ్ దత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ ప్రసంగించిన ఆయన.. యెరవాడ జైలులో ఉన్న సమయంలో కూడా తాను మరాఠీ భాష నేర్చుకోలేకపోయానంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

అయితే ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతున్న మరాఠీ భాషకు సంబంధించిన రాజకీయ చర్చల నేపథ్యంలో వివాదాస్పదంగా మారాయి. రాష్ట్రంలోని ఆటో రిక్షా డ్రైవర్లు తప్పనిసరిగా మరాఠీ నేర్చుకోవాలనే డిమాండ్‌తో శివసేన ప్రచారం నిర్వహిస్తోంది. ఈ వ్యవహారంలో మంత్రి ప్రతాప్ సర్నాయక్ కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి సమయంలో ఆయన నిర్వహించిన కార్యక్రమంలోనే సంజయ్ దత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ విమర్శలకు కారణమయ్యాయి.

సోషల్ మీడియాలోనూ సంజయ్ దత్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కాంగ్రెస్ నేతలతో పాటు బీజేపీకి చెందిన కొందరు నాయకులు కూడా ఈ అంశంపై మంత్రి సర్నాయక్‌ను ప్రశ్నించారు. మరాఠీ భాషపై ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు మంత్రి అక్కడే ఉండి నవ్వడంపై బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు.

వివాదం తీవ్రం కావడంతో సంజయ్ దత్ మంత్రి ప్రతాప్ సర్నాయక్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ‘ప్రతాప్ భాయ్.. జై మహారాష్ట్ర’ అంటూ మరాఠీలోనే సంభాషణ ప్రారంభించినట్లు మంత్రి కార్యాలయం తెలిపింది. తనకు మరాఠీ భాషపై గౌరవం ఉందని, తన కుటుంబం చాలా కాలంగా ముంబైలోనే నివసిస్తోందని సంజయ్ దత్ పేర్కొన్నట్లు వెల్లడించింది.

మహారాష్ట్ర తనకు ఎంతో ఇచ్చిందని, ఆ రాష్ట్రంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని సంజయ్ దత్ చెప్పినట్లు మంత్రి కార్యాలయం పేర్కొంది. తన జీవితంలో కష్టకాలం ఎదురైనప్పుడు శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే అందించిన సహాయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారని తెలిపింది.

తాను చేసిన వ్యాఖ్య వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని సంజయ్ దత్ స్పష్టం చేయడంతో ఈ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది.

also read: ‘మండాడి’ బ్లాక్‌బస్టర్.. థియేటర్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్న దర్శకుడి భార్య!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు