పుట్టిన కొన్ని రోజుల్లోనే పాస్‌పోర్ట్ పొందడం సాధారణంగా అరుదైన విషయమే. అయితే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ పసికందు కేవలం 13 రోజుల వయసులోనే పాస్‌పోర్ట్ పొంది ప్రత్యేక గుర్తింపు సాధించింది. అంతేకాదు.. ఈ ఘనతతో ‘యంగెస్ట్ పాస్‌పోర్ట్ హోల్డర్’గా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన వ్యాపారవేత్త వజ్రపు వెంకటేశ్ మనవరాలు వజ్రపు అగస్య ప్రిన్సీ ఈ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఆమె తల్లిదండ్రులు వజ్రపు ఆశిష్, గీతామాధురి ఉద్యోగరీత్యా లండన్‌లో నివసిస్తున్నారు.
పుట్టిన వెంటనే పాస్‌పోర్ట్ కోసం ప్రయత్నాలు
ఈ ఏడాది మే 30న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గీతామాధురి అగస్య ప్రిన్సీకి జన్మనిచ్చారు. తిరిగి లండన్ వెళ్లాల్సిన అవసరం ఉండటంతో చిన్నారికి వీలైనంత త్వరగా అవసరమైన గుర్తింపు పత్రాలను సిద్ధం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు.
మొదట జూన్ 1న చిన్నారి జనన ధ్రువీకరణ పత్రాన్ని పొందారు. అనంతరం జూన్ 2న బాల ఆధార్ కోసం దరఖాస్తు చేయగా, రెండు రోజుల వ్యవధిలోనే అంటే జూన్ 4న ఆధార్ కార్డు అందింది.
ఆ తర్వాత జూన్ 6న పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేశారు. అవసరమైన ప్రక్రియలు పూర్తవడంతో జూన్ 12న చిన్నారి పాస్‌పోర్ట్ మంజూరైంది. దీంతో పుట్టిన 13వ రోజుకే పాస్‌పోర్ట్ పొందిన చిన్నారిగా అగస్య ప్రిన్సీ ప్రత్యేకత సాధించింది.
గత రికార్డును అధిగమించిన అగస్య
ఇంతకుముందు 19 రోజుల వయసులో పాస్‌పోర్ట్ పొందిన చిన్నారి పేరిట ఉన్న రికార్డును అగస్య ప్రిన్సీ అధిగమించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ కూడా ఈ ఘనతను గుర్తించి, జూన్ 12న అగస్యను ‘యంగెస్ట్ పాస్‌పోర్ట్ హోల్డర్’గా నమోదు చేసినట్లు ఆమె తాత వజ్రపు వెంకటేశ్ వెల్లడించారు.
చిన్నారులకు పాస్‌పోర్ట్ జారీ చేయడం కొత్త విషయం కాకపోయినా.. పుట్టిన కేవలం 13 రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తవడం ప్రత్యేకంగా నిలిచింది. ప్రస్తుతం మూడున్నర నెలల వయసున్న అగస్య ప్రిన్సీ.. ఇంత చిన్న వయసులోనే ప్రపంచ రికార్డులో చోటు సంపాదించడం కుటుంబ సభ్యులతో పాటు స్థానికంగా కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
also read: చిరుతతో పోరాడిన పెంపుడు కుక్క.. తోకముడిచి పారిపోయిన వన్యమృగం!
