Homeఅంతర్జాతీయంబంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు.. వేర్వేరు ఘటనల్లో ఇద్దరి దారుణ హత్య

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు.. వేర్వేరు ఘటనల్లో ఇద్దరి దారుణ హత్య

క్రైమ్ మిర్రర్ : బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతపై ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు హిందువులు హత్యకు గురయ్యారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు. వరుస ఘటనల నేపథ్యంలో అక్కడి హిందూ మైనారిటీల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నౌగావ్‌ జిల్లాలోని మహాదేవ్‌పూర్‌లో 45 ఏళ్ల స్వర్ణకారుడు అలీఫ్‌ చంద్ర దత్తా దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం రాత్రి తన నగల దుకాణం మూసివేసి ఇంటికి బయలుదేరిన ఆయనపై దులాల్‌పారా ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.

పదునైన ఆయుధంతో దాడి చేసిన దుండగులు.. దత్తా వద్ద ఉన్న బంగారు ఆభరణాలతో పాటు సుమారు 7 లక్షల బంగ్లాదేశ్‌ టాకాలను తీసుకుని అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. తీవ్ర గాయాలతో ఉన్న దత్తాను కుటుంబసభ్యులు, స్థానికులు రాజ్‌షాహీ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన వెనుక కేవలం దోపిడీ ఉద్దేశమే ఉందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.

మరో ఘటన కాక్స్‌బజార్‌ జిల్లాలోని మహేశ్‌ఖాలీ ఉపజిల్లాలో చోటుచేసుకుంది. అక్కడ 45 ఏళ్ల హిందూ మహిళ రాణి సుశీల్‌ హత్యకు గురయ్యారు. సోమవారం రాత్రి ఇంట్లో వంట చేసుకుంటుండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేసేందుకు ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అతడిని గమనించిన రాణి కేకలు వేయడంతో నిందితుడు ఆమెపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. కత్తితో పలుమార్లు పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన రాణిని ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఈ ఘటనలకు కొద్దిరోజుల ముందే రంగ్‌పూర్‌లో ఓ రిటైర్డ్‌ హిందూ ఉపాధ్యాయుడు గణపతి చక్రవర్తితో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో ముగ్గురు హత్యకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. బంగ్లాదేశ్‌లో హిందువులతో పాటు ఇతర మైనారిటీ వర్గాలపై దాడుల ఆరోపణలు వినిపిస్తున్న సమయంలో వరుస హత్యలు చోటుచేసుకోవడం ఆందోళనకు కారణమవుతోంది. తాజా ఘటనలపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read: బాత్రూమ్‌లోకి కూడా వస్తారా?’.. మీడియాపై పినరయి విజయన్ అసహనం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు