Homeఅంతర్జాతీయం‘పరారీలో లేను.. బ్రిటన్‌ వీడే పరిస్థితి లేదు’.. విజయ్‌ మాల్యా సంచలన వ్యాఖ్యలు

‘పరారీలో లేను.. బ్రిటన్‌ వీడే పరిస్థితి లేదు’.. విజయ్‌ మాల్యా సంచలన వ్యాఖ్యలు

క్రైమ్ మిర్రర్ : తనను ‘పరారీలో ఉన్న వ్యక్తి’గా పేర్కొనడంపై ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా తీవ్రంగా స్పందించారు. తాను ఉద్దేశపూర్వకంగా బ్రిటన్‌లో ఉండిపోలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం బ్రిటన్‌ నుంచి బయటకు వెళ్లేందుకు తనపై ఉన్న న్యాయపరమైన ఆంక్షలే కారణమని తెలిపారు. 1992 నుంచి బ్రిటన్‌లో శాశ్వత నివాస హక్కుతో జీవిస్తున్నానని మాల్యా పేర్కొన్నారు. భారత్‌కు తిరిగి రావాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో తాను బ్రిటన్‌ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేదని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తన విషయంలో భారత ప్రభుత్వం వ్యవహరించిన తీరు తనకు తీవ్ర అన్యాయం చేసినట్లుగా ఉందని ఆరోపించారు.

కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ రుణాల వ్యవహారం కారణంగా మాల్యా చాలా కాలంగా న్యాయపరమైన వివాదాలను ఎదుర్కొంటున్నారు. సంస్థ భారీ నష్టాల్లోకి వెళ్లి బ్యాంకుల రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితి ఏర్పడిన సమయంలో 2016 మార్చిలో ఆయన భారత్‌ విడిచి బ్రిటన్‌ వెళ్లారు. బ్యాంకుల కన్సార్టియానికి సుమారు రూ.9,000 కోట్ల మేర బకాయిలు ఉన్నాయంటూ ఆయనపై కేసులు నమోదయ్యాయి.2019లో ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం మాల్యాను ఆర్థిక నేరాలకు సంబంధించి పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించింది. అంతకుముందే, ఆయనను భారత్‌కు తీసుకురావడానికి 2017లో కేంద్ర ప్రభుత్వం బ్రిటన్‌ ప్రభుత్వాన్ని అధికారికంగా కోరింది. అదే ఏడాది లండన్‌లో మాల్యా అరెస్టయ్యారు. అనంతరం బెయిల్‌ లభించినప్పటికీ బ్రిటన్‌ విడిచి వెళ్లకూడదనే నిబంధన విధించారు.

మాల్యాను భారత్‌కు అప్పగించాలన్న దిగువ కోర్టు తీర్పును ఆయన ఉన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేశారు. అయితే అక్కడ కూడా ఆయనకు అనుకూలంగా తీర్పు రాలేదు. బ్రిటన్‌ సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసేందుకు అనుమతి కోరినా అది కూడా లభించలేదు. అయినప్పటికీ ఇప్పటివరకు ఆయన భారత్‌కు తిరిగి రాలేదు. అప్పగింత ప్రక్రియకు సంబంధించి మరో గోప్యమైన న్యాయపరమైన అంశం ఉందని భారత ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టుకు తెలిపింది.

ఇటీవల బాంబే హైకోర్టులోనూ మాల్యా తరఫు న్యాయవాదులు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. భారత్‌కు ఎప్పుడు తిరిగి వస్తారో వివరించాలని కోర్టు ప్రశ్నించగా, ఇంగ్లండ్‌, వేల్స్‌ నుంచి బయటకు వెళ్లకుండా బ్రిటన్‌ కోర్టులు ఆంక్షలు విధించాయని న్యాయవాదులు తెలిపారు. మాల్యా పాస్‌పోర్టు కూడా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఇక కింగ్‌ఫిషర్‌ రుణాల విషయంలో బ్యాంకులు వసూలు చేసిన మొత్తం అసలు బకాయిల కంటే ఎక్కువగా ఉందని మాల్యా తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. ఈ అంశంపై న్యాయపరమైన ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.
also read : ప్రమాదం కాదు.. పరువు కోసం కూతురిని హత్య చేసిన తండ్రి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు