– ఓ కానిస్టేబుల్ అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు
– సస్పెన్షన్ వేటు వేసిన తెలంగాణ ప్రభుత్వం
– పూర్తిగా వేటు వేయాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు డిమాండ్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :-
తెలంగాణ రాజకీయాల్లో ఓ సరికొత్త అంశం తెరపైకి వచ్చింది. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పై ఓ కానిస్టేబుల్ సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషించారు. లైంగిక ఆరోపణలు, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే దీనిపై తెలంగాణ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా పెద్ద దుమారం నడుస్తోంది. అయితే తనపై లైంగిక, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కఠిన చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పై అంతర్జాతీయ స్థాయిలో పోరాటం చేస్తానని కల్వకుంట్ల కవిత ప్రకటించారు. తనపై అసభ్యకర కామెంట్లు చేసిన వ్యక్తిపై కేవలం సస్పెన్షన్తో సరిపెట్టకుండా.. తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.
కానిస్టేబుల్ హాట్ కామెంట్స్..
ఇటీవల హైదరాబాదులోని సైబరాబాద్ ఆర్ముడ్ విభాగంలో పనిచేస్తున్న అనిల్ అనే కానిస్టేబుల్ సోషల్ మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. కవితను ఉద్దేశించి అత్యంత హేయమైన, మహిళల ఆత్మగౌరవాన్ని దిగజార్చేలా ఆయన కామెంట్లు పెట్టారు. ఈ వ్యవహారం రచ్చకెక్కడంతో… తీవ్ర ఒత్తిడికి ఎదుర్కొన్న ఆ కానిస్టేబుల్ తదనంతరం తన వ్యాఖ్యలను, సోషల్ మీడియా ఖాతాలను సైతం డిలీట్ చేశారు. దీనిపై మహిళా నేతలు డీజీపీకి, మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు సదరు కానిస్టేబుల్ పై సస్పెండ్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కవిత ఘాటు స్పందన
అయితే తాజాగా ఈ ఘటనపై స్పందించారు కవిత. కేవలం సస్పెన్షన్ చర్య పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని పాలించే కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ దీనిపై చూపిస్తున్న ఉదాసీనతను కవిత తీవ్రంగా ఖండించారు. డిజిపి కి ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. ఒకవేళ మీ కోడలిపై ఎవరైనా ఇంత ఘోరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే కేవలం సస్పెండ్ చేసి ఊరుకుంటారా అని ప్రశ్నిస్తూ నేరుగా డీజీపీని టార్గెట్ చేశారు. ఒక మహిళకే రక్షణ లేకపోతే అలాంటి వ్యవస్థను నడిపే డిజిపి కి ఆ పదవిలో ఉండే అర్హత లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపై కూడా ఈ విషయాన్ని ఎండగడతానని కవిత స్పష్టం చేశారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇది కుదిపేస్తోంది.
