HomeజాతీయంMonalisa Marriage Row: మోనాలిసా మైనరా..? మేజరా..? చివరకు కోర్టే క్లారిటీ ఇచ్చింది!

Monalisa Marriage Row: మోనాలిసా మైనరా..? మేజరా..? చివరకు కోర్టే క్లారిటీ ఇచ్చింది!

కుంభమేళా సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అయి కుంభమేళా మోనాలిసాగా గుర్తింపు పొందిన యువతి కేసులో కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అందుబాటులో ఉన్న పత్రాల ప్రకారం ఆమెను మేజర్‌ గా పరిగణించవచ్చని కోర్టు అభిప్రాయపడింది. అలాగే ఆమె భర్త మహమ్మద్ ఫర్మాన్‌ కు ఒక నెలపాటు ట్రాన్సిట్ బెయిల్ మంజూరు చేసింది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌కు చెందిన మోనాలిసా, కేరళకు చెందిన మహమ్మద్ ఫర్మాన్‌ ను ఈ ఏడాది ప్రారంభంలో వివాహం చేసుకుంది. అయితే తన కుమార్తె ఇంకా మైనర్ అని, ఫర్మాన్ ఆమెను కిడ్నాప్ చేశాడని మోనాలిసా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మధ్యప్రదేశ్‌ లో కేసు నమోదు అయింది. అరెస్టు భయంతో ఫర్మాన్, మోనాలిసా కలిసి కేరళ హైకోర్టును ఆశ్రయించి ట్రాన్సిట్ బెయిల్ కోరారు. విచారణ సందర్భంగా కోర్టుకు సమర్పించిన జనన ధ్రువీకరణ పత్రం, ఓటరు గుర్తింపు కార్డు, బ్యాంక్ పాస్‌ బుక్ వంటి పత్రాలను పరిశీలించిన న్యాయస్థానం, మోనాలిసా పుట్టిన తేదీ 2008 జనవరి 1గా నమోదైందని పేర్కొంది. అందువల్ల ప్రస్తుతం ఆమె మేజర్‌ గా ఉన్నట్లు భావించవచ్చని తెలిపింది.

మరోవైపు మధ్యప్రదేశ్ పోలీసుల తరఫున వాదించిన న్యాయవాది, యువతి ఇంకా మైనర్ అని, సమర్పించిన పత్రాలు నకిలీవని ఆరోపించారు. అలాగే హిందూ యువతి, ముస్లిం యువకుడి వివాహం ఆలయంలో జరగడం చట్టబద్ధం కాదని, వివాహ నమోదు కూడా చెల్లదని వాదించారు. అయితే ఈ వాదనలను కోర్టు అంగీకరించలేదు. ఆరోపణలపై దర్యాప్తు కొనసాగాలని పేర్కొంది.

నెల పాటు ట్రాన్సిట్ బెయిల్

ఫర్మాన్‌ కు జూన్ 3 నుంచి ఒక నెలపాటు ట్రాన్సిట్ బెయిల్ మంజూరు చేసిన కోర్టు, ఆ సమయంలో మధ్యప్రదేశ్‌లోని సంబంధిత కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందవచ్చని సూచించింది. ఈ గడువులో అతడిని అరెస్టు చేయవద్దని కూడా ఆదేశాలు జారీ చేసింది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు