బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ మరోసారి తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఆయన మూడో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా గౌరీ స్ప్రాట్ తో ఆమీర్ సన్నిహితంగా ఉంటున్న సంగతి తెలిసిందే. పలు కార్యక్రమాలు, వ్యక్తిగత వేడుకల్లో ఈ ఇద్దరూ కలిసి కనిపించడంతో వారి సంబంధంపై చర్చలు మొదలయ్యాయి.
జూలై 5న ఈ వివాహం
ఇప్పుడు ఆ చర్చలకు మరింత బలం చేకూర్చేలా పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఆమీర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారని తెలుస్తోంది. జూలై 5న ఈ వివాహం జరిగే అవకాశముందని బాలీవుడ్ మీడియా కథనాలు చెబుతున్నాయి. పెద్ద ఎత్తున వేడుకలు లేకుండా, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఆమీర్ నివాసంలోనే ఈ కార్యక్రమం నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ వేడుకకు బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటులు, ఆమీర్ సన్నిహిత మిత్రులు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.
ఇప్పటికే రెండుసార్లు విడాకులు
ఆమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే, ఆయన మొదట 1986లో తన చిన్ననాటి స్నేహితురాలు రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు జునైద్ ఖాన్, ఐరా ఖాన్ అనే ఇద్దరు సంతానం ఉన్నారు. దాదాపు 16 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత 2002లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత దర్శకురాలు కిరణ్ రావుతో ఆమీర్ ప్రేమలో పడి 2005లో రెండో వివాహం చేసుకున్నారు. వీరికి సరోగసీ ద్వారా ఆజాద్ అనే కుమారుడు జన్మించాడు. అయితే ఈ బంధం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. 2021లో తాము పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ఆమీర్, కిరణ్ రావు సంయుక్తంగా ప్రకటించారు.
ముచ్చటా మూడోసారి..
ఇప్పుడు 61 ఏళ్ల వయసులో ఆమీర్ ఖాన్ కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. రెండు వివాహాలు విఫలమైన తర్వాత మూడోసారి పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.