Homeతెలంగాణమామిడిపండ్లు ఫ్రిజ్‌లో ఎక్కువ కాలం పెడుతున్నారా...! పోష‌కాలు త‌గ్గిపోతాయంటున్నారు నిపుణులు...

మామిడిపండ్లు ఫ్రిజ్‌లో ఎక్కువ కాలం పెడుతున్నారా…! పోష‌కాలు త‌గ్గిపోతాయంటున్నారు నిపుణులు…

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: వేసవి వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది మామిడి పండ్లే. మార్కెట్‌లో కనిపించే రకరకాల మామిడిపండ్లను చాలామంది ఎక్కువగా కొనుగోలు చేసి ఫ్రిజ్‌లో పెట్టుకుంటారు. చల్లగా తినడం బాగానే అనిపించినా.. వాటిని ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచడం ఆరోగ్యానికి ఎంతవరకు మంచిదన్న విషయం మాత్రం చాలామందికి తెలియదు.

వైద్య నిపుణుల సూచనల ప్రకారం మామిడి పండ్లను ఎక్కువ కాలం ఫ్రిజ్‌లో ఉంచితే వాటిలోని సహజ పోషకాలు, విటమిన్లు క్రమంగా తగ్గిపోతాయి. ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైబర్ వంటి పోషకాలు తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో పండ్ల రుచి మాత్రమే కాదు.. వాటి వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలు కూడా తగ్గిపోతాయి.

పచ్చి మామిడికాయలను ఫ్రిజ్‌లో పెట్టడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతలో ఉంటే అవి సహజంగా పండుతాయి. కానీ ఫ్రిజ్‌లో పెట్టితే చల్లటి వాతావరణం కారణంగా పక్వం సరిగా జరగదు. అందుకే పచ్చి మామిడికాయలను బయట గది ఉష్ణోగ్రతలో ఉంచడం ఉత్తమం.

పండిన మామిడి పండ్లను మాత్రం కొద్దిసేపు చల్లబరచడానికి ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు. తినే ముందు కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచితే చల్లగా, రుచిగా అనిపిస్తుంది. అయితే వాటిని మూడు నుంచి ఐదు రోజుల కంటే ఎక్కువ ఫ్రిజ్‌లో ఉంచకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

పచ్చి మామిడికాయలను ఎక్కువ రోజులు నిల్వ చేయాలనుకుంటే మరో పద్ధతి కూడా ఉంది. తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే రెండు నెలల వరకు తాజాగా ఉండే అవకాశం ఉంటుంది.

నిపుణులు చెప్పే ప్రధాన సూచన మాత్రం ఒక్కటే. ఏ పండైనా ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో పెట్టకుండా తాజాగా ఉన్నప్పుడే తినడం మంచిది. అప్పుడు మాత్రమే అందులోని పోషకాలు పూర్తిగా శరీరానికి అందుతాయి. కాబట్టి మామిడి పండ్ల విషయంలో కూడా ఫ్రిజ్‌ను తక్కువసేపు చల్లబరచడానికి మాత్రమే ఉపయోగించి.. వీలైనంత త్వరగా తాజాగా తినడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు