HomeజాతీయంCross-Border Love Story: పాక్ యువకుడు, కశ్మీరీ యువతి ప్రేమకథ.. అమ్మాయి కోసం ఎల్ఓసీ దాటడంతో..

Cross-Border Love Story: పాక్ యువకుడు, కశ్మీరీ యువతి ప్రేమకథ.. అమ్మాయి కోసం ఎల్ఓసీ దాటడంతో..

ఆన్‌ లైన్‌ లో పరిచయమైన యువతిని కలుసుకోవాలనే ఆశతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన ఓ యువకుడు భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన ఘటన జమ్మూకశ్మీర్‌లో వెలుగుచూసింది. అతడు సరిహద్దు దాటిన వెంటనే భద్రతా దళాలు అప్రమత్తమై అదుపులోకి తీసుకున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై అధికారులు లోతుగా విచారణ చేపడుతున్నారు.

అసలేం జరిగిందంటే?

ఉరీ సెక్టార్‌ లోని సిలికోట్ ప్రాంతంలో ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర అనుమానాస్పద కదలికలను భద్రతా దళాలు గుర్తించాయి. ఓ యువకుడు పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించాడని తెలుసుకుని వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నాయి.  విచారణలో అతడు తన పేరు జీషన్ అహ్మద్ మిర్ అని చెప్పాడు.  పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్ ప్రాంతానికి చెందిన అతడికి కొన్ని నెలల క్రితం సోషల్ మీడియా ద్వారా కశ్మీర్‌లోని ఉరీ ప్రాంతానికి చెందిన ఐరమ్ బానో అనే యువతితో పరిచయం ఏర్పడిందని చెప్పాడు. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారడంతో ఆమెను ప్రత్యక్షంగా కలవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు.

ఇద్దరినీ విచారిస్తున్న భద్రతా సిబ్బంది

ఈ నేపథ్యంలోనే ఎలాంటి అనుమతులు లేకుండా సరిహద్దు దాటి భారత్‌లోకి వచ్చినట్లు విచారణలో తెలిపినట్లు సమాచారం. మరోవైపు, అదే ప్రాంతంలో తన ప్రియుడి కోసం ఎదురుచూస్తున్న ఐరమ్ బానోను కూడా భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరినీ వేర్వేరుగా విచారిస్తున్న అధికారులు, వారి పరిచయం ఎలా మొదలైంది, ఎంతకాలంగా సంప్రదింపులు కొనసాగుతున్నాయి, ఏ మాధ్యమాల ద్వారా మాట్లాడుకున్నారు వంటి అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. అలాగే ఈ ఘటన వెనుక మరే ఇతర కోణం ఉందా అనే దానిపైనా దర్యాప్తు కొనసాగుతోంది. సరిహద్దు ప్రాంతంలో భద్రత అత్యంత కీలకమైన నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. యువకుడు ప్రేమ కోసం వచ్చానని చెబుతున్నప్పటికీ, అన్ని కోణాల్లో విచారణ పూర్తి చేసిన తర్వాతే అధికారులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు