HomeజాతీయంAnnamalai: అన్నామలై కొత్త పార్టీపై సస్పెన్స్.. మరో రెండు రోజుల్లో కీలక ప్రకటన!

Annamalai: అన్నామలై కొత్త పార్టీపై సస్పెన్స్.. మరో రెండు రోజుల్లో కీలక ప్రకటన!

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాజీ తమిళనాడు అధ్యక్షుడు కె. అన్నామలై కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నారనే ప్రచారంపై తొలిసారిగా స్పందించారు. సోమవారం న్యూఢిల్లీకి బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రస్తుతం అన్ని విషయాలపై మాట్లాడే సమయం కాదని చెప్పారు. “కొద్దిరోజులు వేచి చూడండి. మరో రెండు రోజుల్లో కూర్చుని అన్ని విషయాలపై మాట్లాడుకుందాం” అని వ్యాఖ్యానించారు.

ఢిల్లీ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత

అన్నామలై ఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీలో తన భవిష్యత్ పాత్ర, పార్టీ పరిస్థితులపై చర్చించేందుకు ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను కలవాలని కోరినట్లు సమాచారం. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పుట్టిన రోజు సందర్భంగా కొత్త పార్టీ ప్రకనట!

ఇదిలా ఉండగా, అన్నామలై జూన్ 4న తన పుట్టినరోజు సందర్భంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశముందనే ప్రచారం తమిళనాడులో జోరుగా సాగుతోంది. దీనికి బలం చేకూర్చేలా మధరై, కోయంబత్తూరు నగరాల్లో  అన్నామలై 2.0 అవతార్ పేరుతో పోస్టర్లు కూడా కనిపించాయి. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తి మరింత పెరిగింది.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన త్రిభాషా విధానంపై అన్నామలై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విధానం విద్యార్థులపై, ముఖ్యంగా తమిళనాడులోని విద్యార్థులపై అదనపు మానసిక ఒత్తిడిని పెంచుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

అన్నాడీఎంకేతో పొత్తుపైనా అన్నామలై అసంతృప్తి

మరోవైపు, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడం కూడా అన్నామలైకి నచ్చలేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కూటమిలో అన్నాడీఎంకే ప్రధాన పాత్ర పోషించడం పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో బీజేపీ నాయకత్వం అన్నామలైను పార్టీలోనే కొనసాగించే ప్రయత్నం చేస్తుందా? లేక ఆయన కొత్త రాజకీయ పార్టీ వైపు అడుగులు వేస్తారా? అనే అంశం ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు