కడప, క్రైమ్ మిర్రర్: ఇద్దరు విద్యావంతులే. పెళ్లి సంబంధం కుదిరి నిశ్చితార్థం జరిగింది. ఆ తరువాత వరుడు ఫోన్ చేసి నీవంటే ఇష్టం లేదని చెప్పడంతో అదీ జోక్ అనుకున్నది. కాని తరుచుగా ఫోన్లో ఇష్టం లేదని చెప్పడంతో మానసికంగా క్రుంగిపోయిన యువతి ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది. వైఎస్సార్ కడప చిన్న చౌకు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
కడప పటేల్ రోడ్డు ప్రాంతానికి చెందిన రెహానా(26) అనే యువతి ఎమ్మెస్సీ పూర్తి చేసింది. గవర్నర్ చేతుల మీదుగా ఇటీవలే పట్టా కూడా అందుకుంది. రెహానాకు ప్రొద్దుటూరుకు చెందిన షాజహాన్ తో ఫిబ్రవరి 15న నిశ్చితార్థం జరిగింది. అతడు బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. నిశ్చితార్థం కావడంతో వీరిద్దరూ రోజు ఫోన్లో మాట్లాడుకునేవారు. చాటింగ్ కూడా చేసుకునేవారు. ఇటీవల సదరు యువకుడు రెహానాతో.. నువ్వంటే ఇష్టం లేదు. నాకు ఇదివరకే నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు’ అని అన్నాడు.
ఏదో తమాషాగా అంటున్నాడని తొలుత రెహానా పట్టించుకోలేదు. పదే పదే అతడు అవే మాటలు అంటూ ఉండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె సోమవారం గదిలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని 12 పేజీల సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. రెహానా తండ్రి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభిస్తుందనుకున్న తమ బిడ్డా విగతజీవిగా మారడంతో మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.