Homeక్రైమ్Digital Arrest Scam: జాగ్రత్త! డిజిటల్ అరెస్ట్ స్కామ్.. బాపట్లలో రిటైర్డ్ టీచర్ బలి!

Digital Arrest Scam: జాగ్రత్త! డిజిటల్ అరెస్ట్ స్కామ్.. బాపట్లలో రిటైర్డ్ టీచర్ బలి!

Cyber Crime Warning: బాపట్ల జిల్లాలో సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో రిటైర్డ్ టీచర్ ను మోసం చేసి భారీగా డబ్బు దోచుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. అమృతలూరుకు చెందిన బన్నారావూరి రామబ్రహ్మం అనే రిటైర్డ్ టీచర్ ఈ మోసానికి గురయ్యారు. పెద్ద మొత్తంలో డబ్బులు మోసపోయారు.

బెంగళూరులో కేసు నమోదైందంటూ..  

గత నెల 24న రామబ్రహ్మంకు కొందరు వ్యక్తులు ఫోన్ చేసి, తమను కర్ణాటక మరియు తెలంగాణ పోలీసులమని పరిచయం చేసుకున్నారు. ఆయన సిమ్ కార్డు ద్వారా అసభ్యకర సందేశాలు పంపించారని, అలాగే బెంగళూరులో కేసు నమోదైందని చెప్పారు. అంతేకాకుండా ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో కూడా ఆయన పేరుతో ఉన్న సిమ్ ఉందని చెప్పి భయపెట్టారు. ఈ కేసుల ద్వారా ఆయన ఖాతాలో రూ.75 లక్షలు వచ్చినట్లు చెప్పి, తాను డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారని హెచ్చరించారు.

పెద్ద మొత్తంలో డబ్బులు ట్రాన్స్ ఫర్

ఈ మాటలను నిజమని నమ్మిన రామబ్రహ్మం, వారు చెప్పిన విధంగా డబ్బులు పంపించడం ప్రారంభించారు. గత నెల 30న హైదరాబాద్‌లోని ఒక బ్యాంకు ఖాతాకు రూ.25 లక్షలు ట్రాన్స్‌ ఫర్ చేశారు. తరువాత ఈ నెల 6న మరో ఖాతాకు రూ.10 లక్షలు పంపించారు. ఇంతటితో ఆగకుండా, మరుసటి రోజు మళ్లీ కాల్ చేసి కేసు సుప్రీంకోర్టుకు వెళ్తుందని, దానికోసం సెక్యూరిటీ డిపాజిట్‌గా మరో రూ.24 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేశారు.

పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..

ఇది చూసిన ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా భార్య చాలా భయపడ్డారు. అయితే కొంతకాలంగా ఈ పరిణామాలను గమనిస్తున్న ఒక స్నేహితుడు అనుమానం వ్యక్తం చేసి, ఇది సైబర్ మోసం కావచ్చని చెప్పాడు. అతని సూచనతో రామబ్రహ్మం పోలీసులను సంప్రదించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు