ఖమ్మంలో మున్నేరు వరద విలయం దారుణంగా ఉంది. వరద తగ్గడంతో తమ ఇండ్లలోకి వెళ్లిన జనాలు.. అక్కడి పరిస్థితిని చూసి తల్లడిల్లిపోతున్నారు. భగవంతుడి దయవల్లే ప్రాణాలతో బతికి ఉన్నామని చెప్పారు. అర్ధరాత్రి తర్వాత ఒక్కసారిగా వరద రావడంతో పరుగులు పెట్టామని చెప్పారు. ఒక్క అధికారి కూడా వరద వస్తుందని తమకు అప్రమత్తం చేయలేదని మండిపడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు.
ఖమ్మం వరదపై సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి వరద సహాయం చెయ్యకుండా తమపై బురద వేస్తున్నారని ఆరోపించారు.ప్రతిపక్షంలో ఉన్నా.. అధికార పక్షంలో ఉన్నా తమపై విమర్శలు చెయ్యడమే రేవంత్ రెడ్డికి పనిగా ఉందన్నారు.ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఫెయిల్ అయ్యారన్నారు హరీష్ రావు. వాతావరణ శాఖ చెప్పినా కూడా ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు.
16 మంది చనిపోయారని ప్రభుత్యం చెప్తుంది.. 31 మంది చనిపోయారని తమకు సమాచారం ఉందన్నారు హరీష్ రావు.
ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది సీట్లు ఇస్తే.. తొమ్మిది మందిని కూడా కాపాడలేకపోయారని హరీష్ రావు విమర్శించారు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని , తప్పులు సరిదిద్దుకోని, ఆపదలో ఉన్న వారిని కాపాడాలని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చనిపోయిన వ్యక్తులకు 25 లక్షలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారన్న హరీష్ రావు.. ఇప్పుడు చనిపోయిన వ్యక్తులకు 25 లక్షలు ఇవ్వాలని చెప్పారు. ఖమ్మంలో సహాయం అడిగిన వరద బాధితులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం దారుణమన్నారు. ప్రజాపాలన అంటే లాఠీ ఛార్జ్ చేయడమా అని ప్రశ్నించారు హరీష్ రావు.