జాతీయం

Terror Module: 4 నగరాలు.. 32 కారు బాంబులు, వామ్మో ఊహించుకుంటేనే భయమేస్తుంది!

Faridabad Terror Module:

ఢిల్లీ కారు బ్లాస్ట్ కేసు నిందితులను విచారిస్తున్న కొద్దీ భయంకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనకు మూలకారకులైన ఫరీదాబాద్ ఉగ్రవాద ముఠా.. దేశంలో ఊహించని రీతిలో విధ్వంసానికి కుట్ర చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. మొత్తం 32 కార్లలో బాంబులు పెట్టి, దేశ వ్యాప్తంగా నాలుగు ప్రధాన నగరాలు, 8 ప్రాంతాల్లో.. ఒకే సారి ఆత్మాహుతి దాడులు జరపాలని ప్రణాళికలు వేశారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హైదరాబాద్ టార్గెట్ గా ఈ దాడులకు స్కెచ్ వేశారు. ఈ కుట్రలన్నీ హర్యానాలోని అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీ కేంద్రంగా చేశారు.

8 మంది.. 4 గ్రూపులుగా విడిపోయి

ఫరీదాబాద్‌ ఉగ్రవాదులు ఏకకాలంలో ఆత్మాహుతి దాడులు చేసేందుకు కీలక పథకం వేశారు. మొత్తం 8 మంది ఉగ్రవాదులు నాలుగు గ్రూపులుగా విడిపోయి, ఏక కాలంలో 32 కారు బాంబులు పేల్చాలని నిర్ణయించారు. ఈ పేలుళ్ల కోసం మొత్తం పాత కార్లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే నాలుగు కార్లను సమకూర్చుకున్నారు. ఎర్రకోట దగ్గర పేలిన కారు వాటిలో ఒకటి. అటు హర్యానాలోని ఓ గ్రామంలో ఎకోస్పోర్ట్‌ కారును గుర్తించారు. అందులో పడుకొని ఉన్న ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

డబ్బుల విషయంలో ఉగ్రవాదుల మధ్య గొడవ!

అటు ముజమ్మిల్‌ వాడిన బ్రెజా (హెచ్‌ఆర్‌87 యూ9988) కారును హర్యానాలోని అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీ క్యాంపస్ లో గుర్తించారు. డాక్టర్‌ షహీన్‌ సయీద్‌ వాడిన స్విఫ్ట్‌ డిజైర్‌ కారును గతంలోనే స్వాధీనం చేసుకోగా, అందులో ఓ అసాల్ట్‌ రైఫిల్‌ దొరికింది. ఈ కార్లలో అమర్చేందుకు ఐఈడీ బాంబులను తయారు చేసేందుకు రూ.3 లక్షలతో 26 క్వింటాళ్ల ఎన్‌పీకే ఎరువులను కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. బాంబుల తయారీ, దాడుల కోసం డాక్టర్‌ ముజమ్మిల్‌, డాక్టర్‌ అదీల్‌, డాక్టర్‌ షహీన్‌ సయీద్‌, డాక్టర్‌ ఉమర్‌ నబీ కలిసి రూ.20 లక్షలు సేకరించి, ఆ డబ్బును నబీ దగ్గర దాచినట్లు గుర్తించారు. ఈ డబ్బు విషయంలో ముజమ్మిల్‌, ఉమర్‌ మధ్య గొడవలు రావడం, ఈ ఉగ్రదాడికి కుట్ర వ్యవహారం నిఘా వర్గాలకు తెలియడంతోనే భయంతో హడావిడిగా ఢిల్లీ కారు బ్లాస్ట్ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.  ఈ కేసులో అరెస్టయిన డాక్టర్లంతా ఆత్మాహుతి బాంబర్లుగా మారాలని నిర్ణయించుకున్నట్లు దర్యాప్తులో తేలింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button