తెలంగాణ

కోర్టు ఉద్యోగాల పేరుతో 31 మంది మహిళలకు కుచ్చు టోపీ..

నల్లగొండ ప్రతినిధి(క్రైమ్ మిర్రర్):- గత కొంత కాలంగా నల్గొండ జిల్లా కోర్టులో స్వీపర్, అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి, కోర్టు పరిసరాలను కేంద్రంగా చేసుకుని నిరుద్యోగ యువతను లక్ష్యంగా, చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారని తెలిసి, నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశానుసారం, ఇట్టి కేసును తిప్పర్తి పోలీసులు ఛేదించి మోసగాళ్లను పట్టుకున్నారు. 31 మంది నిరుద్యోగ మహిళల నుండి 10 లక్షల ముప్పై రెండు వేల రూపాయలను వసూలు చేసిన మహమ్మద్ నసిర్, గాజుల జ్యోతి అలియాస్ జ్యోతి రాణిలను మంగళవారం పోలీసులు పట్టుకున్నారు.. ఇందులో ఏ1గా మొహమ్మద్ నసీర్, ఏ2గా గాజుల జ్యోతిలపై కేసులు నమోదు చేసినట్లు నల్లగొండ డిఎస్పి శివరాంరెడ్డి తెలిపారు..డిఎస్పీ శివరాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, తిప్పర్తి మండలం ఇండ్లూరుకు చెందిన ఏపురి హెప్సిబా అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, తిప్పర్తి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

నిందితులు అయిన మహమ్మద్ నసీర్, జ్యోతి రాణిలు కలిసి అమాయక నిరుద్యోగ మహిళలకు జిల్లా కోర్టులో కాంట్రాక్ట్ స్వీపర్, అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ, మోసపూరిత హామీలు ఇచ్చి కొంతమంది వద్ద నుండి 5 లక్షల చొప్పున, మరికొంత మంది నుండి 20 నుండి 30 వేల రూపాయల చొప్పున వసూలు చేసినట్లు తేలిందన్నారు.. మొత్తం 31 మంది బాధితులు నల్లగొండ, తిప్పర్తి, మాడ్గులపల్లి మండలాలకు చెందిన వారిగా గుర్తించామని, వారి వద్ద నుండి మొత్తం 10 లక్షల పై చిలుకు నగదును అక్రమంగా వసూలు చేసినట్లు తెలిపారు.. వీరిపై తిప్పర్తి పోలీస్ స్టేషన్‌ లో 4 కేసులు, నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌ 3 కేసుల చొప్పున నమోదు అయినట్లు తెలిపారు.. వారి నుండి రెండు సెల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్, పదివేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వివరాలు తెలిపారు..

ఈ కేసును త్వరితగతిన ఛేదించిన శాలిగౌరారం సిఐ కె.కొండల్ రెడ్డిని, తిప్పర్తి ఎస్ఐ సాయి ప్రశాంత్ ని, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డిని, కానిస్టేబుల్ రాంరెడ్డిలను, పోలీస్ బృందాన్ని జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించారు..అమాయకులైన నిరుద్యోగ యువతకు జాబ్ ఇప్పిస్తామంటూ, మాయ మాటలు చెప్పి డబ్బులు అడిగే వాళ్లను నమ్మి మోసపోవద్దని ఎస్పి శరత్ చంద్ర పవార్ యువతకు సూచించారు.. ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడూ ఆఫిషియల్ నోటిఫికేషన్‌ల ద్వారా, పరీక్షల ద్వారా మాత్రమే వస్తాయని, మీ నిరుద్యోగాన్ని ఆసరా చేసుకొని కొంత మంది మోసగాళ్లు వారి స్వలాభం కొరకు అవకాశంగా మలుచుకుంటున్నారని అన్నారు. అందువలన నిరుద్యోగ యువత అప్రమత్తంగా ఉండాలని మాయ మాటలు నమ్మి ఆర్థికంగా నష్టపోవద్దని తెలిపారు.

కొలతలు లేకుండా రోజు కూలీ 600 రూపాయలు చెల్లించాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button