ఆంధ్ర ప్రదేశ్క్రైమ్

14 ఏళ్ల బాలికకు మద్యం తాగించి సామూహిక అత్యాచారం.. ఆపై మరో ఘోరం

కుళ్లిపోయిన స్థితిలో లభించిన బాలిక మృతదేహం, సంఘటనా స్థలంలో ఒక్క స్పష్టమైన ఆధారం కూడా లేకపోయినా జిల్లా పోలీసుల చాకచక్యం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఈ సంచలన కేసును ఛేదించింది.

కుళ్లిపోయిన స్థితిలో లభించిన బాలిక మృతదేహం, సంఘటనా స్థలంలో ఒక్క స్పష్టమైన ఆధారం కూడా లేకపోయినా జిల్లా పోలీసుల చాకచక్యం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఈ సంచలన కేసును ఛేదించింది. మద్దిపాడు మండలం దొడ్డవరంపాడు గ్రామ పరిధిలో గత ఏడాది జూన్ 23న గ్రామస్తులకు గుర్తుతెలియని బాలిక మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా ప్రాంతమంతా ఉలిక్కిపడింది. కపిల్ లేఅవుట్స్ వెనుక భాగంలో పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహం చూసిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

గ్రామ వీఆర్వో దండేల మౌనిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మొదట ఇది సహజ మరణమా, ప్రమాదమా అనే అనుమానాలు ఉన్నప్పటికీ పోస్టుమార్టం నివేదిక వచ్చాక ఇది ఘోరమైన హత్యగా తేలింది. బాలికపై లైంగిక దాడికి పాల్పడి అనంతరం హత్య చేసినట్లు వైద్య నివేదిక స్పష్టం చేసింది. ఈ కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రత్యేకంగా దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు.

రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు నేతృత్వంలో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. మొదట మృతురాలిని గుర్తించడం పెద్ద సవాల్‌గా మారింది. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసులను పోలీసులు క్షుణ్నంగా పరిశీలించారు. ఈ క్రమంలో సింగరాయకొండ గ్రామంలోని మూలగుంటపాడు రోడ్డులోని సుందర్‌నగర్‌కు చెందిన మోదడుగు తిరుపతమ్మ తన కుమార్తె అదృశ్యమైనట్లు ఇచ్చిన ఫిర్యాదు పోలీసుల దృష్టికి వచ్చింది.

తిరుపతమ్మను సంప్రదించిన పోలీసులు, ఆమెకు మృతదేహానికి సంబంధించిన ఫొటోలు చూపించారు. వాటిని చూసిన వెంటనే చనిపోయిన బాలిక తన కూతురేనని ఆమె గుండె పగిలేలా గుర్తించడంతో కేసు కీలక మలుపు తిరిగింది. బాలిక వివరాలు, చివరిసారిగా ఆమె ఎవరి వద్ద కనిపించిందన్న అంశాలపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కాల్ డేటా, కదలికల విశ్లేషణతో పోలీసులు ఒక్కో లింకును కలుపుతూ ముందుకు వెళ్లారు. తీగలాగితే డొంక కదిలినట్లు ముగ్గురు నిందితుల పాత్ర వెలుగులోకి వచ్చింది. పొన్నలూరు మండలం విప్పుకుంట గ్రామానికి చెందిన దుద్దెల చెన్నకృష్ణ, అదే గ్రామానికి చెందిన దేవరాజు వంశీ, ప్రస్తుతం సింగరాయకొండలో నివసిస్తున్న విప్పకుంట గ్రామానికి చెందిన డబ్బుకొట్టు కోటయ్యలు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారించారు.

హత్య చేసిన అనంతరం నిందితులు స్వగ్రామానికి రాకుండా పరారీలో ఉన్నట్లు తేలింది. పోలీసులు రెండు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టాల్సి వచ్చింది. తెలంగాణలోని హైదరాబాద్, నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, నెల్లూరు ప్రాంతాల్లో వారు తలదాచుకున్నట్లు గుర్తించిన పోలీసులు పక్కా వ్యూహంతో వారిని ట్రేస్ చేశారు. చివరకు ముగ్గురినీ చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.

పోలీసు విచారణలో నిందితులు బాలికను పొలాల్లోకి తీసుకెళ్లి బలవంతంగా మద్యం తాగించి లైంగిక దాడి చేసినట్లు అంగీకరించారు. ఈ విషయం బయటపడితే తమకు సమస్య అవుతుందన్న భయంతో ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.

ఈ సంచలన బాలిక హత్య కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు, మద్దిపాడు ఎస్సై జి. వెంకట సూర్యతో పాటు సిబ్బంది షేక్ కరీం, సద్దాం హుసేన్, ఆర్. కృపానందం, వి. హనుమంతరావులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. స్థానిక పోలీస్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఈ కేసు వివరాలను వెల్లడించారు. సమావేశంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు.

ALSO READ: కాలం వెళ్లిపోతోంది.. నీ లక్ష్యం నెరవేరిందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button