క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ సాయం కొన్ని రోజులుగా నిలిచిపోవడంతో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీంతో ఇటీవలే చెక్కుల పంపిణి మొదలుపెట్టారు. అయితే లబ్దిదారులకు చెక్కులు ఇవ్వడానికి మండల కార్యాలయం సిబ్బంది లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు సిబ్బంది బహిరంగంగానే డబ్బులు డిమాండ్ చేస్తున్నారట. లంచం ఇస్తేనే చెక్ ఇస్తాం.. లేదంటే ఇవ్వం.. ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకో పోండీ అని బెదిరిస్తున్నారట కొందరు అధికారులు.
లబ్ధిదారుల వద్ద మండల కార్యాలయం సిబ్బంది లంచం తీసుకుంటున్నారని తాజాగా హైదరాబాద్ జిల్లా బీఅర్ఎస్ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంచలన ఆరోపణలు చేశారు. లబ్ధిదారులకు చెక్కులు అందించేందుకు ఖైరతాబాద్ మండల కార్యాలయం సిబ్బంది చెక్కుకు పదివేల చొప్పున లంచం తీసుకుంటున్నారని అన్నారు. ఈ విషయం బయట పడకుండా ఉండడానికి చెక్కుల పంపిణీ విషయంలో ప్రోటోకాల్ విస్మరించడంతో పాటు ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం తప్పుదో పట్టిస్తున్నారని మాగంటి గోపినాథ్ ఆరోపించారు.
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే మాత్రమే పంపిణీ చేయాలని జీవో ఉండడంతోపాటు గతంలో హైకోర్టు కూడా తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇది పరిగణలోకి తీసుకొని చెక్కుల పంపిణీ నియోజకవర్గంలోని ఓ కమ్యూనిటీ హాల్లో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరిగాయన్నారు. నియోజకవర్గ లో బిఅర్ఎస్ నుండి కాంగ్రెస్ కు వలస వెళ్లిన ఇద్దరి కోసం ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఖైరతాబాద్ మండల కార్యాలయంలో పంపిణీ చేయాలని అధికారులు పేర్కొనడం విడ్డూరంగా ఉందని వాపోయారు మాగంటి.
రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా పాలన పేరుతో ప్రజల వద్దకే వెళ్లాలని చెబుతుండగా రెవెన్యూ అధికారులు మంత్రిని తప్పుదోవ పట్టిస్తూ లబ్ధిదారులపై ఆర్థిక భారం మోపుతున్నారని ఈ విషయంపై త్వరలోనే కలెక్టర్ కు, శాసనసభ సభాపతికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్.