తెలంగాణ

10 రోజుల్లో మంత్రివర్గ విస్తరణ.. కోమటిరెడ్డికి టెన్షన్

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఫిక్సైందని తెలుస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రివర్గ విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ 7తో రేవంత్ పాలనకు ఏడాది పూర్తి కానుంది. ఏడాది పాలనపై పెద్ద ఎత్తున సంబరాలకు కాంగ్రెస శ్రేణులు సిద్ధమవుతున్నాయి. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 9 నుంచి జరగనున్నాయి. ఏడాదిలో ప్రభుత్వం చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, రాబోయే కాలంలో చేపట్టబోయే సంక్షేమ పథకాల గురించి అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధం అవుతోంది. రైతు, కుల గణన సర్వేపై చర్చించే అవకాశాలున్నాయి. దీంతో డిసెంబర్ 7 లోపే మంత్రివర్గ విస్తరణకు సీఎం రేవంత్ ముహుర్తం ఫిక్స్ చేశారని.. హైకమాండ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సమాచారం.

ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్ లో 11 మంది మంత్రులు ఉన్నారు. కేబినెట్ లో మరో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఆరు మంత్రి పదవుల కోసం దాదాపు రెండు డజన్ల మంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలతో హైదరాబాద్ జిల్లాకు ప్రస్తుత కేబినెట్ లో ప్రాతినిధ్యం దక్కలేదు. దీంతో ఆ జిల్లాలకు ఈసారి ఖచ్చితింగా ఛాన్స్ ఇవ్వాల్సిందే. ఆ నాలుగు జిల్లాలతో పాటు నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉంటుందనే టాక్ వస్తోంది. ప్రాంతాలు, జిల్లాలు, సామాజిక వర్గాల ఆధారంగా మంత్రివర్గ కూర్పు ఉండనుందని తెలుస్తోంది.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్నారు. పాలమూరు నుంచి బీసీ కోటాలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజుకి ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. వాకిటికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆశీస్సులు ఉన్నాయి. ముదిరాజుకు మంత్రి పదవి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. అయితే ముదిరాజ్ కోటాలో నీలం మధు కూడా రేసులో ఉన్నారంటున్నారు. మధును కేబినెట్ లోకి తీసుకోవాలంటే ఆయనను ఎమ్మెల్సీ చేయాల్సి ఉంటుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఆశించినా.. ఆయనకు శాసనమండలిలో చీఫ్ విప్ పదవి కట్టబెట్టారు. దీంతో మల్ రెడ్డి, రాంమోహన్ రెడ్డిలో ఒకరికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోటీ తీవ్రంగా ఉంది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు తనకు మంత్రిపదవి ఖాయమనే ధీమాలో ఉన్నారు. ఆయనకు సీనియర్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మద్దతు ఉంది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా తనకు మంత్రి పదవి ఇవ్వల్సిందేనని చెబుతున్నారు. తమ కుటుంబంలో ఒకరికి మంత్రి పదవి ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చిందని వివేక్ గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే వివేక్ ఫ్యామిలీలో ముగ్గురు పదవులున్నాయి. మంత్రిపదవికి ఇది అడ్డంకిగా మారే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. హైదరాబాద్ జిల్లా నుంచి మైనార్టీకి అవకాశం ఇచ్చే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారంటున్నారు. మైనార్టీ కోటాలో మంత్రి పదవి కోసం షబ్బీల్ అలీ, అజారుద్దీన్ తో పాటు ఎమ్మెల్సీ అలీఖాన్ ప్రయత్నిస్తున్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ నేత, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి కేబినెట్ బెర్త్ ఖాయమనే చర్చ నడుస్తోంది. సుదర్శన్ రెడ్డి కోసం సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేబినెట్ లో ఉండగా.. జిల్లాకు మరో బెర్త్ ఇస్తారని అంటున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఖచ్చికంగా మంత్రిపదవి వస్తుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో భువనగిరిలో గెలిపిస్తే మంత్రిపదవి ఇస్తానని రేవంత్ రెడ్డి ఆయనకు హామీ ఇచ్చారని చెబుతున్నారు.

అయితే ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి అన్న వెంకట్ రెడ్డి మంత్రిగా ఉండటంతో ..ఒకే కుటుంబంలో ఇద్దరికి ఎలా ఇస్తారని కొందరు సీనియర్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని టాక్. రాజగోపాల్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకుంటే.. వెంకట్ రెడ్డిని తొలగించాలనే డిమాండ్ వస్తుందట. దీంతో కోమటిరెడ్డి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు తన మంత్రిపదవికి ఇబ్బంది లేకుండా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒత్తిడి పెంచుతున్నారనే టాక్ కూడా వస్తోంది. ఈ విషయం తెలిసే అన్న వెంకట్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి సీరియస్ గా ఉన్నారంటున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button