హైదరాబాద్ లో మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. తూర్పు హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్, ఉప్పల్, కొంపల్లి, మల్కాజ్ గిరి ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. ప్రధాన కూడళ్లు నీటితో నిండిపోయాయి. రోడ్లపైకి భారీగా వరద రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామైంది. సాయంత్రం ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు, స్కూళ్లు.. కాలేజీల నుంచి ఇంటికి వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసి మరింత మెరుగైన సేవలు అందించాలని జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కాట అధికారులను ఆదేశించారు.నగరంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. నగరంలో పలు చోట్ల భారీగా, మరికొన్నిచోట్ల తేలిక పాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కాట క్షేత్ర స్థాయి అధికారులను అప్రమత్తం చేశారు.జోనల్ అధికారులతో పాటు క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వివిధ విభాగాల అధికారులను పర్యవేక్షణ చేసి వాహన దారులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా వెంటనే చర్యలు తీసుకున్నారు.
నగరంలో 154 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, 252 స్టాటిక్ బృందాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వాతావరణ శాఖ వర్ష సమాచారం అందించిన నేపథ్యంలో వెను వెంటనే ముందస్తు జాగ్రత్తల పై కమిషనర్ క్షేత్ర స్థాయి అధికారులను అప్రమత్తం చేసి వరద నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎప్పటి కప్పుడు వాటర్ లాగింగ్ పాయింట్ ల వద్ద నిలిచిన నీటిని వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు కూడా వర్షాలు కురిసే సందర్భంలో ఇంటికే పరిమితం కావాలని పిల్లలను, వృద్ధులను కూడా వర్షంలో ఎక్కడికి పంపించవద్దని, అత్యవసరమైన పని ఉంటేనే బయటకు వెళ్లాలని నగర వాసులకు సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతున్నది.
రోడ్లపై నిలిచిన వరద నీటితో రిస్కు తీసుకోవద్దని, ఎవ్వరైనా మ్యాన్ హోల్స్ తెరిచి ఉంటే తిరిగి మాయకుండా అలాగే ఉన్న పక్షంలో ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. వరద నీరు నిలిచిన, ప్రవహిస్తున్నా నీటిలో నడవడం వల్ల కలిగే ప్రమాదాల నుంచి దూరంగా ఉండాలని నగర ప్రజలను జిహెచ్ఎంసి కమిషనర్ కోరారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అంటూ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించడం జరుగుతున్నదని, దోమల నివారణకు అందరూ కృషి చేయాలని, సీజనల్ వ్యాధుల పై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.