తెలంగాణ

హైడ్రా పేరుతో కాంగ్రెస్ నేత వసూళ్లు.. హైదరాబాద్‌లో కొత్త దందా

హైడ్రా కూల్చివేతలు తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్నాయి. హైడ్రా బాధితులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. తమ ఇండ్లను కూల్చిన అధికారులపై దుమ్మెత్తి పోస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని తిట్టనితిట్టు తిట్టకుండా తిడుతున్నారు. అటు హైడ్రాపై తగ్గేది లేదంటోంది ప్రభుత్వం. మూసీ సుందరీకరణ చేసి తీరుతామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే హైడ్రా పేరుతో వేల కోట్లు దండుకోవడానికే సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు వసూళ్లకు దిగుతున్నారని చెబుతున్నాయి.

విపక్షాలు ఆరోపిస్తున్నట్లే కొన్ని ప్రాంతాల్లో హైడ్రా పేరుతో కాంగ్రెస్ నేతలు వసూళ్లుకు దిగుతున్నారని తెలుస్తోంది. పాతబస్తీలో హైడ్రా పేరుతో బెదిరించి కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ అనుచరులు డబ్బులు అడుగుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని సయ్యద్ నగర్ మిలటరీ ఏరియాలో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ అనుచరులు వచ్చి హైడ్రా సర్వే పేరుతో బెదిరిస్తున్నారని స్థానికులు రోడ్డెక్కారు. డబ్బులు ఇస్తే సర్వే చేయమని లేదంటే సయ్యద్ నగర్ ప్రాంతం నుండి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ సయ్యద్ నగర్ ప్రాంత వాసులు ఆందోళనకు దిగారు.

నాంపల్లి సయ్యద్ నగర్ తరహాలోనే మూసీ పరివాహక ప్రాంతాల్లో చాలా చోట్లు స్థానిక కాంగ్రెస్ నేతలు ఇలాంటి వసూళ్లకు దిగుతున్నారని అంటున్నారు. మూసీతో పాటు చెరువు బపర్ జోన్లలో ఇండ్లు కట్టుకున్న వారి నుంచి డబ్బులు వసూల్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కూకట్ పల్లి నల్లచెరువు పరిధిలోనూ స్థానిక కాంగ్రెస్ నేత పెద్ద ఎత్తున డబ్బులు వసూల్ చేశారని.. దీనిపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు వెళ్లిందని తెలుస్తోంది.

 

Back to top button