తెలంగాణ

హైడ్రా ఎఫెక్ట్.. భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్లు..320 కోట్లు లాస్

తెలంగాణలో సంచలనంగా మారిన హైడ్రా ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. హైడ్రా కూల్చివేతలకు జనాల నుంచి మంచి స్పందన వస్తుండగా.. దాని అఫెక్ట్ తో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడింది. హైడ్రాతో జనంలో నెలకొన్న భయాందోళనలతో గత నెలతో పోలిస్తే రూ.320 కోట్ల మేర ఆదాయం తగ్గిపోయింది.

హైడ్రా కూల్చివేతల ప్రభావం రిజిస్ట్రేషన్ల శాఖపై భారీగా చూపిస్తుంది.జూలై నెలతో పోలిస్తే ఆగస్టులో రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గిపోయాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్ జిల్లాల్లో రిజిస్ట్పేషన్లు భారీగా పడిపోయాయి. ఈ నాలుగు జిల్లాల పరిధిలో జూలై నెలలో మొత్తం 58,000 రిజిస్ట్రేషన్లు జరగగా.. ఆగస్టులో 41,200 రిజిస్ట్రేషన్లు మాత్రమే అయ్యాయి.జూలైలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.1105 కోట్ల కాగా.. ఆగస్టులో రూ.320 కోట్ల మేర ఆదాయం తగ్గి రూ.785 కోట్లకి పడిపోయింది.

హైడ్రా కూల్చివేతలతో భూముుల కొనేవారు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో ఎక్కువగా చెరువులు, అసైన్డ్ ల్యాండ్ ఉండటంతో ఫ్లాట్ల కొనుగోలుకు జనాలు వెనుకంజ వేస్తున్నారు. అదే సమయంలో అపార్ట్ మెంట్లలో ఫ్లాట్ల కొనుగోళ్లు దాదాపుగా నిలిచిపోయాయని తెలుస్తోంది. అమీన్ పూర్, బాచుపల్లి, మణికొండ, గండిపేట ఏరియాల్లో గతంలో ఫ్లాట్స్ బుక్ చేసుకున్న వారు కూడా హైడ్రా భయంతో రద్దు చేసుకుంటున్నారని రియల్ ఎస్టేట్ సంస్థలు చెబుతున్నారు. హైడ్రా విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోతే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మరింత పడిపోయే అవకాశం ఉందంటున్నారు. ఇది రాష్ట్ర ఆదాయంతో పాటు పెట్టుబడులపైనా గణనీయమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది.

Back to top button